నేడు విశాఖ ఏజన్సీలో జగన్ సభ: విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ ఏజన్సీలో చింతపల్లిలో బహిరంగ సభ, ధర్నా నిర్వహించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉదయం 9గంటలకు విమానంలో విశాఖకు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చింతపల్లి వెళతారు. బాక్సైట్ త్రవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని వైకాపా నేతలు చెపుతున్నారు.
కల్తీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు: విజయవాడలో కల్తీ మద్యం కేసుపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపిఎస్. అధికారి మహేష్ చంద్ర లడ్డా నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ఈ టీమ్ లో ఎస్పి సెంథిల్ కుమార్, డీ.ఎస్పిలు ఎం. వెంకటేశ్వర రావు, కనకరాజు, సి.ఐ.లు మీరా సాహెబ్, శ్రీనివాస రావు, అబ్దుల్ కరీమ్, సిహెచ్ రాంబాబులు సభ్యులుగా నియమించింది. విజయవాడ పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు.
విజయనగరం మునిసిపాలిటికి కార్పోరేషన్ హోదా: విజయనగరం మునిసినిపాల్టీకి కార్పోరేషన్ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం. తద్వారా విజయనగర అభివృద్ధి వేగం పుంజుకొంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాల్టీ పరిధి ఎంతవరకు విస్తరించి ఉందో అంత వరకు మాత్రమే కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పోరేషన్ పరిధి కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం మునిసిపాల్టీకి కార్పోరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతాము: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి వీలు లేదని హైకోర్టు ఆదేశించినప్పటికీ తప్పకుండా నిర్వహించి తీరుతామని కొందరు విద్యార్ధులు ప్రకటించారు. అవసరమయితే దాని కోసం మళ్ళీ హైకోర్టు ఆశ్రయిస్తామని తెలిపారు. ఉస్మానియాలో మోహరించిన పోలీసులు ఇప్పటికే సుమారు 11 మంది బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులను అరెస్ట్ చేసారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ప్రధాని మోడీకి జయలలిత లేఖ: ఇటీవల చెన్నైలో కురిసిన బారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, కనుక ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖ వ్రాశారు. కానీ ఉత్తరా ఖండ్, జమ్మూ కాశ్మీర్ లో వరదలు, విశాఖలో హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా కేంద్రానికి ఇటువంటి అభ్యర్ధనలే వచ్చేయి. కానీ కేంద్రం వాటిని మన్నించలేదు. కనుక జయలలిత అభ్యర్ధనను కూడా కేంద్రం పట్టించుకోకపోవచ్చును.