ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే… ఇకపై అందరి దృష్టి మంత్రి వర్గంపైనే ఉంటుంది. ఇప్పటికే ఆశావహుల సంఖ్య చాలా పెద్దదిగా ఉందని సమాచారం! కేబినెట్ లో ఎవరికి స్థానం కల్పించాలనే అంశాన్ని జూన్ 15 తరువాత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే, పదవులు ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి… కొంతమంది అసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నాయనే చర్చా జరుగుతోంది. దాదాపు 25 మంది మంత్రులతో మంత్రి వర్గాన్ని జగన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీ తరఫున 150 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి. వీరిలో సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీకి వీర విధేయతగా ఉంటూ వచ్చినవారు… ఇలాంటి జాబితాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని పదవుల పంపిణీ చేయడం కొంత కత్తిమీద సామే అవుతుంది.
జగన్ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 51 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలోంచి కొంతమందికి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో… ఇతర ఆశావహుల పరిస్థితి ఏంటనేది కూడా కొంత చర్చనీయమే అవుతుంది. ఇంకోటి… ఇచ్చిన మాట తప్పరు అనేది జగన్ కి ఉన్న ఇమేజ్. ఎన్నికల ప్రచారానికి ముందే చాలామందికి మంత్రి పదవులు ఇస్తానంటూ ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి, ముందుగా ఆ హామీల ప్రాధాన్యతా క్రమంలో మంత్రి పదవులు ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అంశం. అయితే, పార్టీ పెట్టిన నుంచీ వైకాపాతో ఉన్నవారు, 2014 ఎన్నికల్లో గెలిచాక కూడా పార్టీ నుంచి బయటకి వెళ్లనివారు… ఇలాంటి వారికి మంత్రి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాసు మొదట్నుంచీ జగన్ తో ఉన్నారు. ఆ తరువాత, ధర్మాన ప్రసాదరావు వచ్చారు. కాబట్టి, ఈ సోదరుల్లో కృష్ణదాసుకు పదవి దక్కుతుందనే అంచనాలున్నాయి. సుచరిత, తానేటి వనిత, శ్రీకాంత్ రెడ్డి… ఇలా మొదట్నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవారి పేర్లు ముందుగా వినిపిస్తున్నాయి. వైకాపా నుంచి 16 మంది మహిళా శాసన సభ్యులు గెలిచారు. వీరిలో ఐదుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో రోజా పేరు మొదట్నుంచీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్నుంచీ పార్టీతో ఉన్నవారికి మొదట ప్రాధాన్యత ఉంటుందనీ, తన తండ్రి వైయస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు ధర్మాన, బొత్సలాంటి వారి గురించి తరువాత జగన్ ఆలోచిస్తారని అంటున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యేల్లో విద్యావంతులైనవారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి గెలిచిన ఆదిములపు సురేష్ ఇతర ఎమ్మెల్యేలతో పోల్చితే విద్యాధికుడు. ఆయనకీ కేబినెట్ లో చోటుండే అవకాశం ఉందనీ వినిపిస్తోంది. మొత్తానికి, 25 మందితో కూడిన తన కేబినెట్ ను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్టుగా వైకాపా వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో రకరకాల సమీకరణల నేపథ్యంలో ఎంపికలు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని అసంతృప్తులూ తప్పకపోవచ్చు!