ఏపీ సీఎం జగన్ దూకుడు చూస్తూంటే మార్చి తర్వాత బడ్జెట్ పెట్టి… అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఏప్రిల్‌లో అసెంబ్లీ రద్దు చేస్తే.. నాలుగు నెలల కాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నాలుగు నెలల కాలంలో.. అరవై వేల కోట్ల అప్పులు చేసి.. ప్రజలకు విచ్చలవిడిగా పంచేసి… ఎన్నికలకు వెళ్తే.. బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత గెలిస్తే పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగేవారుండరు. అడిగితే.. రెండో సారి గెలిచిన పవర్‌తో పోలీసుల్ని పంపి.. మూసేయవచ్చు. అదే మరో ఏడాది పాలన అంటే.. అప్పులు పుట్టడం గగనం అవుతుంది.
మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాలని ప్రశాంత్ కిషోర్ టీం సలహా ఇచ్చిందని చెబుతున్నారు. ముందస్తు సంకేతాలివ్వాలని మంత్రులకు కూడా హైకమాండ్ సందేశం ఇచ్చింది. అందుకే అప్పల్రాజు ఎప్పుడైనా ఎన్నికలంటూ కొత్త రాగం అందుకున్నారు. పై స్థాయి నుంచి సంకేతాలు లేకపోతే అప్పల్రాజు అలా మాట్లాడరు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్ సర్వే పూర్తి చేసింది. ఇటీవల జగన్ రేయింబవళ్లు కసరత్తు చేసి అభ్యర్థిని ఫైనల్ చేశారని చెబుతున్నారు. దాని ప్రకారమే ఇంచార్జుల్ని.. ఇతరుల్ని మారుస్తున్నారు.
టీడీపీ, జనసేన మధ్య పొత్తు అంటూ ఏర్పడితే.. అది ఉత్తరాంత్ర నుంచి నెల్లూరు వరకూ ప్రభావం చూపిస్తుందని.. రాయలసీమలోనూ లెక్కలు మారుతాయన్న అంచనాలు ఇప్పటికే వచ్చాయి. అందుకే జనసేన టీడీపీతో వెళ్లకుండా చేయాల్సినంత చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే.. జరిగే నష్టం అపారం.. అందుకే… వీలైనంత వరకూ ఆ పార్టీల మధ్య సఖ్యత పూర్తి స్థాయిలో ఏర్పడక ముందే ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.