ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పో సప్పో చేసి అయినా… ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సమయానికి ఇవ్వకపోయినా పథకాల డబ్బులు మాత్రం సమయానికి బ్యాంకుల్లో వేసేందుకు శ్రమిస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నిర్దేశిచినట్లుగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకుఈబీసీ నేస్తం పథకం కింద ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని సంక్రాంతి పండుగకన్నా ముందే విడుదల చేస్తారు. తొమ్మిదో తేదీన సీఎం జగన్ ఈ పథకానికి మీట నొక్కే అవకాశం ఉంది.
మొత్తంగా ఈ పథకానికి దాదాపుగా నాలుగు లక్షల మంది లబ్దిదారుల్ని గుర్తించారు. 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని ఈ పథకం కింద అందిస్తున్నారు. ఇందుకుగానూ రూ.589 కోట్లను కేటాయించింది. పథకం ప్రారంభానికి ముందు రెండు రోజులు అంటే ఏడో తేదీ నుంచి ఆ తర్వాత మరో 7 రోజులపాటు అంటే సంక్రాంతి అయిపోయే వరకూ ప్రచారాన్ని నిర్వహిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు ఈ ప్రచారం చేస్తారు.
గత ఎన్నికల సమయలో 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత అది సాధ్యం కాదని… 45 -60 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఏటా పదిహేను వేల సాయం చేస్తామన్నారు. అయితే ఈబీసీ వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అనేక రకాల ఆంక్షలు పెట్టడంతో చివరికి లబ్దిదారులు నాలుగు లక్షల మంది కన్నా తక్కువగానే తేలుతున్నారు.