ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు మీడియం తీసేసి ఇంగ్లిష్ మీడియంను ఏపీ స్కూళ్లలో అమలు చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇందు కోసం న్యాయపరంగా అనేక ఆటంకాలు ఎదురవడంతో ఇప్పుడు వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. స్కూళ్లలో నాడు – నేడు పనులపై సమీక్ష జరిపిన జగన్.. అందులో… కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకూ సీబీఎస్ఈసీ కరికులంను పాటించాలని ఆదేశించారు. 2024 వరకు మొత్తంగా ఏపీలో సీబీఎస్ఈ సిలబస్ మాత్రమే ఉండాలని ఆయన నిర్దేశించారు. సీబీఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్.
ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నస్కూళ్లకు ఉద్దేశించినంది. అయితే ఈ కరికులంను ప్రైవేటు స్కూళ్లు కూడా అనుసరించవచ్చు. వారి సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పి.. వారు నిర్వహించే పరీక్షలు రాయిస్తారు. సీబీఎస్ఈకి సంబంధించి పది, పన్నెండు తరగతులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. అంతా ఇంగ్లిష్, హిందీ మీడియాలు మాత్రమే ఉంటాయి. దక్షిణాదిన ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంటుంది. స్థానిక భాషలో సబ్జెక్టులుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో తెలుగు మీడియం ఉండకూడదన్న పట్టుదలతో ఉన్న సీఎం జగన్ .. ఈ సీబీఎస్ఈ ప్రకారం వెళ్తే తన లక్ష్యం నెరవేరుతుందని… న్యాయపరమైన ఆటంకాలు కూడా రావని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సొంతంగా సెకండరీ బోర్డులను కలిగి ఉంటాయి. వాటిద్వారానే ఉన్నత విద్య సిలబస్ ఖరారు చేసి.. పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తూంటారు. ఇంగ్లిష్ మీడియం కూడా మొత్తంగా ఏపీలో ఎస్ఎస్సీ బోర్డు ఉనికిని ఏపీ సర్కార్ వద్దనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ నిర్ణయంపై విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలులో వచ్చే సమస్యలపై విద్యా రంగ నిపుణుల్లో చర్చ జరిగితే కానీ క్లారిటీ రాదంటున్నారు.