అధికార పార్టీలకు… ఎప్పుడూ.. ఓ ఇబ్బంది ఉంటుంది. అదే అసంతృప్తి. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాము కాబట్టి.. తమకు పదవులు దక్కాలనేది.. ఎక్కువ మంది ఆశ. దక్కకపోతే అసంతృప్తికి గురవుతారు. అందుకే… ఆయా పార్టీల అధినేతలు కూడా..దీనికి విరుగుడు చూపిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో మొదటిది… మంత్రివర్గంలో కొన్ని ఖాళీలు ఉంచడం. విస్తరణలో మీకే చాన్స్ అని.. అందరికీ చెప్పి.. కామ్‌గా ఉండేలా చేయడం.
నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యేల్లో 15 శాతం మంత్రి మాత్రమే మంత్రులు ఉండాలి. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ కాకుండా మరో ఇరవై ఐదు మంది మంత్రులు కేబినెట్ లో ఉండొచ్చు. వీరందర్నీ ప్రస్తుతం జగన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంది. జిల్లాలు, సామాజిక సమీకరణలు, సామర్థ్యం, విధేయత, అంకిత భావం, పార్టీలో సీనియారిటీ వంటి అంశాలను సీఎం జగన్ పరిగణనలోకి తీసుకుంటారని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ నిబంధనను విధించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ను పలువురు నేతలు కలుస్తున్నప్పటికీ, ఆయన తన మనసులోని భావాలను ఎవరి వద్ద వ్యక్తపరచటం లేదు. దీంతో ఎమ్మెల్యేల్లో కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి పదవులు వస్తాయోనని అటు సీనియర్లు, ఇటు జూనియర్లు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
జగన్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరగనున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ తన మనసులోని భావాలను తెలియచేస్తారు, అవసరమైతే నేతల పేర్లను కూడా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. అర్హులైన వారెవరికైనా మంత్రి పదవులు ఇవ్వనిపక్షంలో వారికి వేరొక పదవులు కట్టబెట్టి అవసరమైనచోట ఉపయోగించుకుంటామని జగన్ చెప్పే అవకాశాలున్నాయి. ఉన్న పరిమితుల దృష్ట్యా ఆశించిన వారందరికీ పదవులు ఇవ్వలేమని సాధ్యమైనంత వరకు తాను అందరికీ తగిన న్యాయం చేస్తానని జగన్ వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి పదవులు దక్కని వారికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇవ్వనున్నారు. పార్టీ కార్యక్రమాల అమలుకు కూడా కొంతమంది నేతలను పార్టీ పని కోసం ఉపయోగించుకోనున్నారు. నవరత్నాల అమలుకు ఒక శాఖను కూడా కేటాయిస్తారని, ఇందుకోసం ఒక అధికార వ్యవస్థను రూపొందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న జగన్.. తాజాగా కేబినెట్ లో మంత్రుల ఎంపికలో కూడా జాగ్రత్తగా వ్యవహారించాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.