ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే..ఈ ఫిర్యాదు పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారో… శాంతిభద్రతలు క్షీణించాయనో కాదు… ప్రజలకు సంబంధించిన అంశంలో… కేంద్రం ఇచ్చిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందన్న అభిప్రాయంతో.. కేంద్రానికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులను.. ఏపీ సర్కార్ పక్కదారి పట్టించిందనే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ పేదలు చేసిన పనులకు చెల్లించాల్సిన నిధులు. ఈ విషయంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకుని.. ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని లేఖలో కోరారు.
కేంద్రం పెండింగ్ బిల్లులు రూ.1845 కోట్లు విడుదల చేసినా… రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి ఇంకా విడుదల చేయలేదని చంద్రబాబు లేఖలో కోరారు. ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని … పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిధులు మళ్లించడం సరికాదని చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు ఉపాధి హామీ పధకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. నిజానికి కేంద్రం.. ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పేదలకు నేరుగా ఉపాధి కల్పించే కార్యక్రమం కావడంతో.. పక్కాగా అడిట్ చేసి నిధులు విడుదల చేస్తుంది. అయితే ఆ నిధులను.. ఏపీ సర్కార్ విడుదల చేయలేదు. వాటిని ఇతర అవసరాలకు వాడుకున్నారని… ప్రచారం జరుగుతోంది. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ఇదే విషయాన్ని వ్యూహాత్మకంగా హైలెట్ చేస్తున్నారు. గత వారం నేరుగా జగన్‌కే లేఖ రాశారు. స్పందించకపోవడంతో ఇప్పుడు కేంద్రానికి లేఖ రాశారు. నిజానికి ఈ విషయంలో కేంద్రం కూడా అసంతృప్తిగా ఉంది.
జగన్ అనేక విషయాన్ని కేంద్రం మాటలను పెడ చెవిన పెడుతూండటంతో కేంద్రమంత్రులు కూడా అసహనానికి గురవుతున్నారు. ఈ గ్యాప్ ను సులువుగా అర్థం చేసుకున్న చంద్రబాబు.. కేంద్రానికి ఫిర్యాదు పంపారు. గతంలో వైసీపీ లేఖలతో.. కేంద్రం ఉపాధి హమీ నిధులు రాకుండా ఉడ్డుకుంది. ఇప్పుడు… చంద్రబాబు రివర్స్ లో ఏపీ సర్కార్ కు ఇచ్చిన నిధులు విడుదల చేయాలని లేఖ రాశారు. రియాక్షన్ ను బట్టి రాజకీయం కూడా మారే అవకాశం ఉంది.