ఒక రాజకీయ నాయకుడికి తాను ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉండే విషయంలో ముందుచూపు లేకపోయినా పరవాలేదు. కానీ.. తాను మాట్లాడే మాటల విషయంలో ముందుచూపు తప్పకుండా ఉండాలి. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉంటున్నప్పుడు ఏం మాట్లాడితే.. దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో.. దాని పర్యవసానాలు ఎన్ని విధాలుగా మలుపులు తిరుగుతాయో ఊహించగలిగి ఉండాలి. తద్వారా ఎన్ని రకాల కొత్త సవాళ్లు తన ముందకు వస్తాయో గెస్ కొట్టాలి. అంతకంటె పరిణతి ఉన్న నాయకుడే అయితే గనుక.. సదరు కొత్తగా పుట్టుకువచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా మాట జారినప్పుడే ప్రిపేరైపోవాలి.
కానీ అలాంటి ప్లానింగ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి ఉన్నట్లుగా లేదు. గవర్నరును కలిసి వచ్చిన తర్వాత.. చంద్రబాబు సర్కారును కూల్చివేయడం గురించి ఆయన మీడియాతో తన సత్తా గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీకి జనంలో ఆదరణ తగ్గిపోతున్నదని, చంద్రబాబుకు దమ్ముంటే గనుక.. తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాలు విసిరారు. నిజానికి రెండేళ్ల ప్రాయం పూర్తికాని కొత్త ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయడం ఏవిధంగా సబబు అనే అంశాన్ని పక్కన పెడితే.. ఆయన ఈ సవాలు విసిరినప్పుడు అందరూ ఒక పాయింటు మాత్రం అంచనా వేశారు. తెదేపాకు ఆదరణ తగ్గింది… వైఎస్సార్ కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతున్నది అని నిరూపించుకోవడానికి చంద్రబాబును బెదిరించి లేదా ఇలా బతిమాలి ప్రభుత్వాన్ని రద్దు చేయించడం ఎందుకు? తన చెప్పుచేతల్లో ఉన్న 67 మంది పార్టీ ఎంఎల్ఏలను రాజీనామా చేయిస్తే.. ఆస్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్లవచ్చు కదా.. ఆ స్థానాలను మొత్తం ఆయన మళ్లీ గెలుచుకుంటే.. గత సార్వత్రిక ఎన్నికలకంటె ఎక్కువ మెజారిటీలు సాధిస్తే సరిపోతుంది కదా? అనే మీమాంస వచ్చింది.
ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కూడా ఇదే ప్రతిసవాలు విసురుతున్నారు. జగన్కు దమ్ముంటే తన ఎమ్మెల్యేల్తో రాజీనామాలు చేయించి.. ఆ స్థానాలను మళ్లీ గెలుచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయమనే మాట అన్నప్పుడే.. దానికి జవాబుగా ఎలాటి ప్రతిస్పందనలు వస్తాయో ఊహించి ఉండాలి. ఇలాంటి డిమాండు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఆయనకు ఒక లెక్క ఉండి ఉంటే బాగుండేది. కానీ ఏదో యథాలాపంగా అంత పెద్ద మాట వదిలేయడం వల్ల.. ఇప్పుడొచ్చిన ప్రతసవాలు విషయంలో జగన్ కోటరీ మౌనం దాల్చవలసిన అగత్యం ఏర్పడినట్లుంది.