సంక్షేమ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తానన్న సీఎం జగన్ ఎన్నికల హామీకి అనుగుణంగా మరో పథకాన్ని ఇంటికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకూ రేషన్ బియ్యాన్ని .. కార్డు దారులు .. చౌకధరల దుకాణం వద్దకు తీసుకెళ్లి తీసుకునేవారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. అందు కోసం ప్రత్యేకంగా కొంత మందిని నియమించి వారికి సబ్సిడీ కింద వాహనాలను కూడా కొనుగోలు చేసింది. రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. ఆ వాహనాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.
వాహనం పొందిన వ్యక్తికి ఎలాంటి ఈ పాస్ యంత్రాన్ని, బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వదు. రోజూ ఉదయం డీలర్ వద్ద తీసుకోవాలి. పంపిణీ చేసిన తర్వాత సాయంత్రం మళ్లీ అప్పగించాలి. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు బియ్యంపంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. అయితే ఈ పంపిణీలో వాలంటీర్లకు పెద్దగా బాధ్యత ఉండదు. ఇతరులకు ఉపాధి లభిస్తుంది. ఈ వాహనాలపై మూడు లక్షల వరకూ సబ్సిడీ ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది.
అయితే గతంలో పేదలు ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి రేషన్ తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు… వాహనదారుడు వచ్చి ఇచ్చే వరకూ ఎదురు చూస్తూ ఉంటారు. పద్దెనిమిది రోజులు సమయం ప్రభుత్వం ఇచ్చింది. అంటే రేషన్ ఇవ్వడం ప్రారంభించిన పద్దెనిమిది రోజుల వరకూ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. వాహనాలు తక్కువగా ఉండటంతో ఈ సమస్య వచ్చింది. అదే సమయంలో.. వాహనాదారులు బద్దకిస్తే.. మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించకపోతే అభాసు పాలయ్యే ప్రమాదం ఉంది.