కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు.చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదో ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీగా మారిపోయింది. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో అదే స్ట్రాటజీ అందుకుంటున్నారు. చంద్రబాబు వస్తే… అంటూ ఆరున్నొక్క రాగాలు అందుకుంటున్నారు.
చంద్రబాబు వస్తే చంద్రముఖి లకలక మంటూ వస్తుందని.. పథకాలు ఆగిపోతాయని.. రక్తం తాగేస్తారని … జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. చంద్రబాబు వస్తే ఇంటింటికి పెన్షన్ రాదని… ఇంకోటని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇక్కడ జగన్కు.. కేసీఆర్ ఉన్నంత విస్తృతమైన అవకాశాలు లేవు. ఎందుకంటే కేసీఆర్ పదేళ్లలో తెలంగాణలో గుణాత్మకమైన మార్పునూ చూపించారు. రోడ్లు, మంచినీరు వంటి విషయాల్లో గుణాత్మకమైన మార్పు చూపించారు. పాలన విషయంలో ఆయనపై ఉన్న రిమార్క్స్ తక్కువ. కేవలం అధికార దుర్వినియోగం.. అహంకారం కారణంగానే ఆయన ఓడిపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి.. చంద్రబాబు వస్తే.. అన్నీ ఆగిపోతాయని చెప్పే విస్తృతమైన అవకాశాలు లేవు. ఎవరు వచ్చినా ఉండే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఒక్కటే మార్గం.
అమరావతి ఆపేస్తారని.. పోలవరం ఆపేస్తారని.. రోడ్ల నిర్మాణం ఆపేస్తారని.. తాను తీసుకు వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి పంపేస్తారని.. ఇలా జగన్ రెడ్డి బెదిరించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే..ఆయన తెచ్చింది.. చేసింది ఏమీ లేదు. పథకాలు మాత్రమే ఆపుతారని ఆయన భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ.. నొక్కిన బటన్లను డబ్బులు పడలేదు. మళ్లీ వస్తే… పన్నులరూపంలో పిండుకోవడం తప్ప.. పథకాల రూపంలో డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ప్రజలకు క్లారిటీ వస్తోంది.
విచిత్రంగా.. టీడీపీ మేనిఫెస్టోకు కూడా జగన్ ప్రచారం చేస్తున్నారు. గత మేనిఫెస్టోలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత మేనిఫెస్టో అమలు చేయడానికి చాలా నిధులు కావాలని ఎక్కడ్నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. జగన్ లా ఇంట్లో కూర్చునే సీఎం చంద్రబాబు కాదని.. ప్రజలకు క్లారిటీ ఉంది.. మరి జగన్ దీన్ని ఎలా చంద్రబాబుకు మైనస్ చేద్దామనుకుంటున్నారో కానీ.. ఎన్నికలకు ఆ ప్రచార భేరి మాత్రం ..చాలా నీరసంగా ప్రారంభమయిందని చెప్పుకోవచ్చు.