ఆంధ్రప్రదేశ్‌లో… సౌర, పవన, బయోమాస్, జల విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామంటూ … ప్రభుత్వం తరపున చేసిన కొన్ని ప్రకటనకు.. కేంద్రం నుంచి కొద్ది రోజుల కిందట రియాక్షన్ ఇచ్చింది. అలా చేయడం.. ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని.. చెబుతూ.. కేంద్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి ఓ లేఖ పంపారు. అది హైలెట్ అయింది. అయితే.. జగన్ మాత్రం.. మొదటి కేబినెట్ భేటీలో ఆ లేఖను పట్టించుకోలేదు. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించుకున్నారు.
కేంద్ర కార్యదర్శి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించింది. పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొనుగోళ్ల ఒప్పందాలపై పత్రికల్లో, ప్రసార మాద్యమాల్లోనూ వార్తా కథనాలొచ్చాయి. దీనిపై కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఖరారు చేసిన ఈ ఒప్పందాలను సమీక్షించటం మంచిదికాదని దీనివల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతినటమే కాకుండా భవిష్యత్తులో పెట్టుబడి దారులు బిడ్లు వేసేందుకు ముందుకురారని స్పష్టం చేశారు. సీఎంకు చెప్పాలని సీఎస్‌కు సూచించారు. సీఎస్ జగన్‌కు విషయం చెప్పారు కూడా.
వెంటనే జగన్మోహన్ రెడ్డి.. మోడీ ఏపీ పర్యటన సమయంలో.. ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మోడీ శ్రీవారి దర్శననానంతరం తిరుమల నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్ కు వచ్చే సమయంలో ప్రధాని మోడీ తో పాటు జగన్, నరసింహన్ ఒకే కారులో వచ్చారు. ఆ సమయంలో కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ రాసిన లేఖను జగన్.. ప్రధాని మోడీకి చూపించారు. అక్రమాలు జరిగాయని.. సమీక్షించాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు. దాంతో ప్రధాని విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో అవకతవకలు జరిగితే వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉందని, అవకతవకలు జరిగాయని నిర్థారణ జరిగితే విచారణ కూడా నిర్వహించాలని సూచించారు. దీంతో జగన్ సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పీపీఏలను సమీక్షించాల్సిందేనని నిర్ణయించారు.
నేరుగా ప్రధాని పర్మిషన్ ఇవ్వడంతో… విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించారు. ఆ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి.. అభ్యంతరాలను కూడా.. జగన్మోహన్ రెడ్డి.. అలా అధిగమించారు. వీటిపై తదుపరి కార్యాచరణ కోసం చర్చలు జరుపుతున్నారు. ఓ కమిటీ వేసి విద్యుత్ ఒప్పందాలను సమీక్షించే అవకాశం ఉంది.