హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై గుంటూరులో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వాయిదా వేశారు. వాస్తవానికి ఈ దీక్ష ఈ నెల 15న ప్రారంభమవ్వాల్సి ఉంది. 15లోపు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాపై ఒక ప్రకటన చేయకపోతే 15న దీక్షకు దిగుతానని జగన్ గత మంగళవారం ప్రకటించారు. అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, 15వ తేదీన దీక్ష ప్రారంభించటంలేదని జగన్ చెప్పారు. 17న వినాయక చవితి ఉన్నందున పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నిరాహారదీక్షను ఖచ్చితంగా చేస్తానని, బహుశా 20న ఉండొచ్చని చెప్పారు. పంతొమ్మిదా, ఇరవయ్యా అనేది పార్టీలో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు. మరోవైపు ఇవాళ ముగిసిన అసెంబ్లీ సమావేశాలగురించి మాట్లాడుతూ, అసలు సమావేశాలు ఐదురోజులు పెట్టటమే అన్యాయమని అన్నారు. అసెంబ్లీ వేదికను చంద్రబాబు భ్రష్ఠుపట్టించారని విమర్శించారు. అసెంబ్లీ సజావుగా సాగకపోవటానికి చంద్రబాబు, స్పీకర్ బాధ్యులు అని జగన్ ఆరోపించారు.