ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన దేశరాజధానిలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రులతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఆయన ఢిల్లీకి వెళ్లడంతో తాజా పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ ప్రత్యేక హోదా గుర్తు చేస్తుంటామని ఆ మధ్య సీఎం చెప్పారు. కేంద్రం మనసు మారే వరకూ వదలమన్నారు. వైకాపా ఎంపీలను కూడా పార్లమెంటులో హోదా సాధన కోసం పోరాటం చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. కానీ, ఇకపై ఏ రాష్ట్రానికీ హోదా అసాధ్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో స్పష్టం చేశారు. అంతేకాదు, పారిశ్రామిక రాయితీలైనా ఇవ్వండని వైకాపా ఎంపీ కోరితే… అది కూడా అసాధ్యమనీ, ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న పథకాలతోనే ఏపీ అభివ్రుద్ధి చెందుతుందని నితిన్ గట్కరీ కూడా పార్లమెంటులోనే తేల్చి చెప్పారు. ఇక, కేంద్ర బడ్జెట్లో కూడా ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపులంటూ ఏవీ లేవు. ఇంకా చెప్పాలంటే గతం కంటే దారుణమైన పరిస్థితి బడ్జెట్లో కనిపించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన ఫండింగ్ నుంచి ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిన పరిస్థితి. కేంద్రం సూచనల మేరకే ఇలా జరిగిందనే కథనాలూ ఈ మధ్య వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏయే అంశాలపై ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాగుతుందనేది కొంత ఆక్తికరంగా మారింది.
తాజా పర్యటనలో హోదా ఇవ్వాలంటూ మరోసారి కేంద్రాన్ని సీఎం అడుగుతారని వైకాపా నేతలు అంటున్నారు. విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్న ఆస్తుల పంపకాలపై కూడా చొరవ చూపాలంటూ మరోసారి కేంద్రాన్ని కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి… సాయం కోరాలనేది కూడా ప్రధాన అజెండాగా తెలుస్తోంది. నిజానికి, వీటిలో ఇప్పటికే కొన్ని అంశాలపై కేంద్రం వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రాకి చాలా చేశామనీ, ప్రత్యేకంగా చెయ్యాల్సింది ఏం లేదనే ధోరణిలోనే ఉంది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి వెళ్లి, ప్రత్యేక హోదా, ఆర్థిక సాయం, విభజన హామీల గురించి డిమాండ్ చేస్తే… మోడీ సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.