వైఎస్ జగన్ కు మరో కఠిన పరీక్ష ఎదురవుతోంది. అదే సొంత జిల్లా కడప జడ్పీచైర్మన్ ఉపఎన్నిక. మొన్నటి వరకూ జడ్పీచైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పాటు పలు స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. అందరి దృష్టి కడప జడ్పీచైర్మన్ ఎన్నికలపైనే ఉంది.
కడప జడ్పీల్లో అప్పట్లో ఏకగ్రీవాలు
స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎలా నిర్వహించిందో ఎవరూ మర్చిపోలేరు. కడప జిల్లాలో ఎవర్నీ నామినేషన్ కూడా వేయనివ్వలేదు. జడ్పీటీసీ పోస్టుల్లోనూ అంతే. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో 49 మంది వైసీపీ జడ్పీటీసీ సభ్యులు. వీరిలో ప్రజుల ఓట్లు వేస్తే గెలిచింది 11 మంది మాత్రమే. మిగతా 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించుకున్నారు. ఒక్క విపక్ష సభ్యుడూ లేకపోతే బాగుండదని.. గోపవరం నుంచి మాత్రం టీడీపీ సభ్యుడిని నిలబడనిచ్చి .. గెలవనిచ్చారు. ప్రస్తుతానికి రెండు జడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి.
వైఎస్ కుటుంబంలో చిచ్చు – పోయిన అధికారంతో జడ్పీటీసీలు జంప్
ఎన్నికలకు ముందే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా జడ్పీటీసీలు వైసీపీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అప్పట్లోనే ఆరుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డితో మెజార్టీ జడ్పీటీసీలు టచ్ లోకి వచ్చారు. అయితే వారిని ఇంకా నేరుగా పార్టీలోకి చేర్చుకోలేదు. చంద్రబాబు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు.
జగన్కు పరువు సమస్య – ప్రత్యేక దృష్టి
కడప జడ్పీచైర్మన్ ఎన్నిక జగన్ కు పరువు సమస్యగా మారడంతో .. జడ్పీటీసీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. ఓ సారి తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించారు. చాలా రోజుల క్రితమే బ్రహ్మంగారి మఠం మండలం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. జడ్పీటీసీలు పార్టీ మారకుండా సంతృప్తి పరచాలని ఆయనకు సూచించారు. ఆయన వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వానికి మెజార్టీ వైసీపీ జడ్పీటీసీలు సానుకూలంగా లేరన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
టీడీపీ అభ్యర్థిని నిలబడితే హైవోల్టేజ్ రాజకీయం
కడప జడ్పీచైర్మన్ ఎన్నికలో టీడీపీ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. టీడీపీకి అధికారికంగా ఒక్కరే సభ్యుడు ఉన్నాడు. అయితే జడ్పీటీసీలను ఆకర్షించి..వైసీపీని ఓడిస్తే మాత్రం అది జగన్ కు మరో ఘోరమైన ఓటమి అవుతుంది. ఇప్పటికే సాగునీటి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అందుకే టీడీపీ పోటీ చేయడంపై ఉత్కంఠ నెలకొంది.