మాజీ ముఖ్యమంత్రి అయినా సీఎం నాటి భద్రతను ఇంకా జగన్ కు కొనసాగిస్తున్నారు. దీనికి కారణం ప్రజా ప్రతినిధుల సెక్యూరిటీని రివైజ్ చేసే కేమిటీ సిఫార్సులు ఇంకా అమల్లోకి రాకపోవడం. ఇంటలిజెన్స్ చీఫ్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎవరెవరికి ఎంతెంత భద్రత ఉండాలో … ఆయా నేతలకు ఉండే ముప్పును అంచనా వేయడం ద్వారా ఖరారు చేస్తారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే భద్రతకు ఇంటలిజెన్స్ చీఫ్ రిపోర్టులు కీలకం.
కొత్త ఇంటలిజెన్స్ చీఫ్ గా లడ్హా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సమావేశాన్ని సుదీర్ఘంగా నిర్వహించారు . ఈ మేరకు కీలకమైన సిఫారసులు చేసినట్లుగా తెలుస్తోంది. వారంలో వాటిపై ఆదేశాలు వెలువడనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం సీఎం స్థాయి సెక్యూరిటీని పొందుతున్నారు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి… ఆ మేరకు సెక్యూరిటీని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సీఎం కాన్వాయ్ ను ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఆయనకు ఏ స్థాయి సెక్యూరిటీని రిఫర్ చేసి ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంకా తమకు ముప్పు ఉందంటూ.. అంబటి రాంబాబు సహా కొంత మంది కోర్టులకు వెళ్లారు. ఇంకా సెక్యూరిటీ కమిటీ సిఫారసులు చేయలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడీ సిఫారసులు తర్వాత మరికొంత మంది తమకు భద్రత కావాలని కోర్టులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ నిబంధనల ప్రకారమే.. సెక్యూరిటీ కల్పిస్తారు. గతంలో చంద్రబాబుకు కేంద్ర సెక్యూరిటీ తప్ప.. రాష్ట్రం పరంగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తులకు కల్పించాల్సిన సెక్యూరిటీ కల్పించలేదు. ఉద్దేశపూర్వకంగా చేశారన్న అనుమానాలు కూడ ఉన్నాయి. అందుకే కేంద్రమే సెక్యూరిటీ పెంచింది.