పోలవరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు ఓడిషా సీఎంను… ఆహ్వానించే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయగలరా..?. పోనీ ఎగువరాష్ట్రమైన మహారాష్ట్రలో.. బాబ్లీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ ను ఘనంగా చేసి.. ఆ కార్యక్రమానికి.. తెలంగాణ సీఎంను ఆహ్వానించగలరా..?. కర్ణాటక ప్రభుత్వం కావేరీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచి… ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు ముఖ్య అతిధిగా… తమిళన సీఎంను ఆహ్వానింగలరా..?. ఆహ్వానించినా.. ఆయా ముఖ్యమంత్రులు వెళ్తారా..?. వ్యవహారం భగ్గమనదూ..! ఎందుకంటే.. ఆయా ప్రాజెక్టులన్నీ కడుతున్నది ఎగువ రాష్ట్రాలు. వాటిపై.. దిగువ రాష్ట్రాలకు చాలా అభ్యంతరాలున్నాయి. అనుమతులు లేకపోవడం దగ్గర్నుంచి నీటి కేటాయింపులు కూడా… వివాదాస్పదం కావడమే దానికి కారణం. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా.. దిగువ రాష్ట్రమైన ఏపీకి అలాంటిదే. ఆ ప్రాజెక్ట్ కట్టడం నిబంధనలకు విరుద్ధమని…ఆ ప్రాజెక్ట్ వల్ల ఏపీకి కేటాయింపుల ప్రకారం రావాల్సిన నీరు రాదని… ఏపీ సర్కార్ గత ఐదేళ్లుగా నెత్తినోరు బాదుకుని… కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు.. పదే పదే ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తోంది. కానీ కేసీఆర్.. ఇప్పుడు.. అదే ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేసి… ఆ ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చేతనే.. ప్రారంభోత్సవం చేయించబోతున్నారు. స్వయంగా విజయవాడ వెళ్లి.. ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణను సస్యశ్యామం చేసేప్రాజెక్ట్ ప్రారంభోత్సవ పండుగకు.. ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ తో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాల నేపధ్యంలో ఆయన వెళ్లడం ఖాయమని అనుకోవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమమని ఐదేళ్లుగా ఏపీ సర్కార్ పోరాటం..!
ఆంధ్రప్రదేశ్ తొలి నుంచీ కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఇది పూర్తిగా కొత్త ప్రాజెక్టేనని వాదిస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం.. గోదావరి బేసిన్లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డుల అనుమతి తీసుకోవాల్సి ఉందని పేర్కొంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ అనుమతులు లేనందున దాన్ని అక్రమ ప్రాజెక్టుగానే చూడాలని వాదిస్తోంది. అంతేకాదు కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన అంతరాష్ట్ర ఒప్పందాన్ని కూడా ఏపీ వ్యతిరేకించింది. బేసిన్ పరిధిలో ఉన్న తమను సంప్రదించకుండా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని, అది తమ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని పేర్కొంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదులు కూడా చేసింది. గోదావరిలో ఎలాంటి నీటి వినియోగం చేసినా కేంద్రం, బోర్డుతో పాటు తమ ఆమోదం తప్పనిసరైనా.. అలాంటిదేమీ జరగలేదని వివరించింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను పట్టించుకోకుండా వ్యవహరించడం ఏమిటని.. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని గతంలోనే కేంద్రాన్ని కోరింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై గోదావరి బోర్డును అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరింది.
ఉమ్మడి వాటా పంపకం లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం ..!
అయితే ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు అలా ఉండగానే..కేంద్రంతో సన్నిహిత సంబంధాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, అటవీ, పర్యావరణ అనుమతులతోపాటు కీలకమైన టీఏసీ అనుమతి కూడా లభించింది. అప్పట్లోనే ఏపీ దీనిపై తీవ్ర వ్యతిరేకత తెలిపింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి), 85(డి) నిబంధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే.. దానికి బోర్డు నుంచి కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉందని.. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో అలా జరగలేదని ఫిర్యాదులో పేర్కొంది. గోదావరిలో ఉమ్మడి వాటాగా ఉన్న 1,494 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా వాడుకోవాలో ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రాజెక్టు ద్వారా తెలంగాణ 225 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటే.. దిగువ రాష్ట్రమైన తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ గట్టిగా వాదిస్తోంది.
జగన్‌తో ప్రారంభింపచేస్తే కేసీఆర్ అసాధ్యడని అంగీకరించక తప్పదు..!
ఇప్పుడు కేసీఆర్ వ్యూహంతో… ఏపీ సీఎంను.. నేరుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు పిలుస్తున్నారు. అంటే.. ఏపీ సీఎం నేరుగా ఆమోదించినట్లవుతుంది. ఫలితంగా.. గోదావరి జలాల వినియోగం విషయంలో తెలంగాణకు మద్దతు తెలిపినట్లవుతుంది. ఆ ప్రభావం ఏపీపై ఎంత మేర ఉంటుందో.. తర్వాతర్వాత తెలుస్తుంది.