జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో ఏపీ సర్కార్ పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు తేదీలలో అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనల ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. నిరాహారదీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇవి కంట్రోల్ తప్పితే.. ఇబ్బందికరం అవుతుందనుకుంటున్న ప్రభుత్వం.. వారిని కూల్ చేసేందుకు కొత్త ప్రయత్నం చేస్తోంది. జాబ్ క్యాలెండర్ను మార్చే ఉద్దేశంలో ఉన్నామని.. మరిన్ని పోస్టులు పెంచుతామని.. ఆరో తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్న సమాచారాన్ని బయటకు పంపించారు.
ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో పదివేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ యువత ఆశలు పెట్టుకునే గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో వారు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. మంత్రుల్ని అడ్డుకుంటున్నారు. యువత పోరాటానికి ఇతర పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత కవర్ చేసుకుందామనుకున్నా.. సాధ్యం కావడం లేదు. తాము వచ్చిన తర్వాత ఆరు లక్షలు ఉద్యోగాలిచ్చామని లెక్కలు చెబుతున్నా.. వినిపించుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటున్నారు.
ఇప్పటికే జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు సహా అందరూ క్లారిటీ ఇచ్చారు. పోలీసు శాఖలో చాలా ఖాళీలు ఉన్నా… శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి భర్తీ చేయడం లేదని సవాంగ్ ప్రకటించారు. మిగిలిన శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆరో తేదీన కేబినెట్ భేటీలో ఏమైనా కొత్త ఉద్యోగాలు జత చేసి.. ప్రకటన చేస్తారనే అంచాలు ఉన్నాయి. అయితే.. మరో నాలుగైదు వేల పోస్టులు జత చేసినా.. నిరుద్యోగులు సంతృప్తి చెందే అవకాశం లేదు. గతంలో జగన్ ప్రకటనల వల్ల నిరుద్యోగుల్లో అంచనాలు.. ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.