అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా వర్షా కాల సమావేశాలను సెప్టెంబర్ .. అక్టోబర్‌లో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ముందే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నామని గవర్నర్‌కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ బిల్లులేమిటన్నదానిపై సమాచారం బయటకు రాలేదు. అయితే ఏపీ ప్రభుత్వానికి కీలక బిల్లు అంటే.. మూడు రాజధానులు మాత్రమే.
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. న్యాయపరంగా ఎలాంటి చాన్స్‌లు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే అప్పీలుకు వెళ్లలేదని భావిస్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఎలా తెరపైకి తేవాలన్నదానిపై మేథోమథనం జరిపి ఓ మార్గాన్ని కనిపెట్టారని అంటున్నారు. అది చట్ట విరుద్ధమైనా… కోర్టుల్లో మళ్లీ అక్షింతలు పడినా సరే… ఓ బిల్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దానికీ అడ్డంకులు ఎదురవుతాయి కానీ.. అలా అవడం వల్లే ఎక్కువ ప్లస్ ఉంటుందన్న వ్యూహం ఉంది.
వచ్చే ఎన్నికలు… ఓటింగ్ పాలన తీరుపై జరగడం కన్నా… మూడు రాజధానుల అంశంపై జరిగితే మంచిదని ప్రభుత్వం భావిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఆ ఎన్నికలకు ఎజెండాను సెట్ చేయడం అన్నీ వైసీపీ .. ఓ వ్యూహం ప్రకారం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మామూలుగా అయితే ఇంత అర్జంట్‌గా అసెంబ్లీ సమావేశం పెట్టాల్సిన పని లేదని.. ఖచ్చితంగా ఓ సంచలనం ఉంటుందని భావిస్తున్నారు.