వైకాపా ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో తెదేపాలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అనే నినాదంతో వైకాపా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలకు సిద్దమవుతోంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సీనియర్ నేతలను, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని మధ్యాహ్నం 11గంటలకు గవర్నర్ నరసింహన్ని కలిసి పార్టీ ఫిరాయింపులపై ఆయనకు పిర్యాదు చేస్తారు. ఆ తరువాత సాయంత్రం కొవ్వొతుల ర్యాలి నిర్వహించి నిరసనలు తెలియజేస్తారు. అనంతరం బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెదేపా ప్రభుత్వ అవినీతి పాలన గురించి, పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేస్తోందో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తారు. ఈనెల 25న జగన్ తన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధానిని, రాష్ట్రపతిని కలిసి వారికి కూడా తెదేపా ప్రభుత్వంపై పిర్యాదు చేస్తారు. క్లుప్తంగా ఇవీ వైకాపా చేపట్టబోయే ఆందోళన వివరాలు.
అయితే ఒకటే ప్రశ్న. వీటి వలన ఏమయినా ఫలితం ఉంటుందా?లేదా? అంటే ఇప్పటికిప్పుడు ఏమీ ఉండదనే చెప్పవచ్చు. ఎందుకంటే, కేంద్రం ఆదేశిస్తే తప్ప గవర్నర్ ఇటువంటి విజ్ఞప్తులను పిర్యాదులను ఎన్నడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. తెదేపా ప్రభుత్వం ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైకాపా చెపితే తప్ప ప్రజలకు అర్ధం కాదనుకోవడం అవివేకమే. అలాగే తెదేపా ప్రభుత్వంపై జగన్, వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు కొత్తగా వింటున్నవేమీ కాదు. కనుక ప్రజలను చైతన్యపరచడం కోసమే ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడం కూడా వృధా ప్రయాసే. అది వైకాపా క్యాడర్ ని కలిపి ఉంచడానికి పార్టీలో ఎమ్మెల్యేలను, నేతలను బిజీగా ఉంచడానికి, తద్వారా వారు పార్టీని వీడిపోకుండా కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని భావించవచ్చు. అయితే వైకాపా చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రజలను ఆలోచింపజేయవచ్చు. ఆ ప్రభావం వచ్చే ఎన్నికల వరకు ఉంటే వారు తెదేపాకి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు కానీ అప్పటిలోగా వారి ఆలోచనలను ప్రభావితం చేసే అంశాలు, రాజకీయ పరిణామాలు చాలా జరుగవచ్చు.
ఇంక జగన్మోహన్ రెడ్డి ప్రధానిని, రాష్ట్రపతిని కలవడం కూడా ఒక ప్రహసనమే. ఎందుకంటే మోడీ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను ఏవిధంగా కూల్చి వేసిందో, అందరూ చూస్తూనే ఉన్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు కేంద్రప్రభుత్వానికి చివాట్లు పెట్టి, రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా తప్పు పట్టింది. అయినా కేంద్రప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసి ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకొంది. అధికార దాహంతో అడ్డుగోలుగా ప్రజా ప్రభుత్వాలను కూల్చివేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న డిల్లీ పెద్దల వద్దకి వెళ్లి జగన్ మొరపెట్టుకోవడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? రోలోచ్చి మద్దెలతో మోరపెట్టుకొన్నట్లుంది వైకాపా వ్యవహారం.