ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ మంగళవారం లభించడంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం ప్రధానమంత్రిని కలుస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలిసి.. మధ్యాహ్నం తర్వాత తాడేపల్లికి బయలుదేరి వస్తారు. సీఎం జగన్ ఇటీవలి కాలంలో ఏ ముఖ్యమంత్రి కలవనన్నీ ఎక్కువ సార్లు మోదీని కలుస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి హాజరయ్యారు. అక్కడ మోదీతో కలిసి ఒకే టేబుల్‌పై లంచ్ చేశారు.
అయితే వ్యక్తిగతంగా కలిసి చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టే ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ అడిగి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అవి రాష్ట్రానికి చెందిన అంశాలా.. వ్యక్తిగత విషయాలా అన్నదానిపై స్పష్టత లేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ఒకే రకమైన విజ్ఞప్తులతో కూడిన ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. అందులో ప్రత్యేకహోదా నుంచి పోలవరం వరకూ చాలా అంశాలుంటాయి. అయితే వాటిని ఎప్పుడూ కేంద్రం పట్టించుకోలేదు. ఈ సారి ఆయన ఎలాంటి విజ్ఞప్తులతో వెళ్తున్నారో స్పష్టత లేదు.
పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడి జనం మోదీని తిట్టుకుంటున్నారని ఆ విషయం చెప్పడానికి అపాయింట్ మెంట్ అడిగానని త్వరలో కలుస్తానన్నారు. నీతఆయోగ్ భేటీ కాకుండా పర్సనల్‌గా జగన్ మరోసారి కలవడం ఆ తర్వాత ఇదే. పోలవరం నిధుల గురించి ఏమైనా అడుగుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక పోలవరంకు తామివ్వాల్సిందేమీ లేదని.. రెండున్నర వేల కోట్లేనని కేంద్రం ఇటీవలే తేల్చి చెప్పింది. అదే సమయంలో అప్పుల పరిమితి కూడా ముగిసిపోయింది. అదనపు అనుమతుల కోసం బుగ్గన చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.