భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తున్నారని రెండున్నరేళ్లలో తొలి విమానం దిగుతుందని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. అసలు ఎప్పుడో శంకుస్థాపన చేసిన ఎయిర్ పోర్టుకు పనులు చేయకుండా కాంట్రాక్టులు రద్దు చేసి.. నాలుగేళ్లకు శంకుస్థాపన చేస్తున్నారు..ఇక ఎప్పటికీ కడతారు అన్నది అసలు డౌట్. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కనిపించిన చోట అల్లా శంకుస్థాపనలు చేస్తున్నారు సీఎం జగన్.
నిజాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాఖకు ప్రత్యేక ఎయిర్పోర్టు అవసరం అని చంద్రబాబు బోగాపురం నిర్మించాలని సంకల్పించారు. అద్భుతమైన వనరులతో.. విమానాల సర్వీసింగ్ ఏర్పాట్లు కూడా ఉంటే… జంక్షన్ అవుతుందన్న ఉద్దేశంతో గట్టి ప్రణాళికలు వేశారు. కాంట్రాక్టు జీఎంఆర్కు దక్కింది. శంకుస్థాపన కూడా చేశారు. ఇక పనులు కొనసాగించాల్సిన పరిస్థితులో వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్టులు రద్దు చేసింది. చివరికి జీఎంఆర్కు చెందిన కాకినాడ సెజ్ చేతులు మారిన తర్వాత ఐదు వందల ఎకరాలు ఎయిర్ పోర్టుకు తగ్గించి మళ్లీ ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఐదు వందల ఎకరాలు తగ్గించినందుకు విమానాల సర్వీసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం లేదు. దాని వల్ల ఎవరికి నష్టం ?
కాంట్రాక్ట్ జీఎంఆర్ కు మళ్లీ ఇచ్చి రెండేళ్లు దాటిపోతున్నాయి. కానీ పట్టించుకున్న వారు లేరు. కాంట్రాక్టులు రద్దు చేయడం వల్ల అనుమతుల్ని మళ్లీ తెచ్చుకోవాల్సి వచ్చింది. పరిహారం కోసం రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సమస్యలేమీ పరిష్కరించకుండానే మళ్లీ జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ పనులు జరుగుతాయని ఎవరికీ నమ్మకం లేదు. ఇప్పటివరకూ ఏపీలో ఒక్క అభివృద్ధి పనీ సక్రమంగా జరగలేదు మరి !