ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన బెంచ్ మార్క్ .. సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి అవాంతరాలను కోరుకోవడం లేదు. ఆదాయం ఉన్నాలేకపోయినా.. నిధులు ఎలాగైనా సమీకరించి.. పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు… రాష్ట్రానికి పన్నుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్ర పన్నుల వాటాలోనూ కోత పడింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాల కోసం నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. డ్వాక్రా మహిళలకు జగన్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రకటించారు. దాని ప్రకారం.. వారికి రూ. 1400కోట్లు చెల్లించాల్సి ఉంది. వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో..ఆ నిధులు ఏమి ఇస్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం… ఈ నెల ఇరవై నాలుగో తేదీన డ్వాక్రా మహిళలకు రూ. 1400కోట్లు విడుదల చేయాలని ఆదేశిస్తూ సంతకం చేశారు. 90లక్షల మంది డ్వాక్రా మహిళలకు తాము కట్టిన వడ్డీ డబ్బులు వెనక్కి వస్తాయి.
ఇక విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ను కూడా నెలాఖరులో విడుదల చేస్తున్నారు. ఇరవై ఏడో తేదీన పదకొండున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకోడానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ సారికి కాలేజీలకు చెల్లిస్తున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు ఇవ్వడం లేదు. ప్రతి మూడు నెలలకు తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. వారు కళాశాలలకు ఆ మొత్తాన్ని ఫీజుగా చెల్లించనున్నారు. దీని వల్ల కాలేజీలు… బోగస్ స్టూడెంట్స్తో అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా పోతుంది.
డ్వాక్రా మహిళలకు…. నాలుగేళ్లలో యాభై వేల రూపాయల రుణమాఫీ చేస్తానని నవరత్నాల హామీలో జగన్ ప్రకటించారు. అలాగే సామాజిక పెన్షన్లను.. ఏటా 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని హామీ ఇచ్చారు. మేలో… రైతు భరోసా ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి నిధుల కొరత అనేది లేకుండా… అప్పులు తెచ్చి అయినా సరే..సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఆ మేరకు ముందడుగు వేస్తున్నారు.