వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వాటిల్లో అమరావతి ఒకటి. చంద్రబాబు అవసరానికి ఆయన అమరావతి వచ్చేసి… తాత్కలికంగా భవనాలు కట్టేసి.. అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్నారు కానీ… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు. మామూలుగానే… చంద్రబాబు చేసినదేదీ నచ్చదు. కాబట్టి.. ఆయన సెక్రటేరియట్‌ను… అసెంబ్లీని ఉపయోగించుకోరని… ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్‌కే ఓటు వేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం.. ఈ విషయంలో అంచనాలను తలకిందులు చేశారు. అమరావతి నుంచి పాలన చేయబోతున్నారు.
అమరావతి సెక్రటేరియట్‌లోనే జగన్ సమీక్షలు..!
తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ జయలలిత వర్సెస్ కరుణానిధి రాజకీయాల్లో.. ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చేవారు. ఇలా వచ్చే సమయంలో.. ఒకరు చేసిన పనుల్ని మరొకరు అవమనించుకునేవారు. ఓ సారి కరుణాధి.. అత్యంత భారీగా శాసనసభ భవనం కట్టిస్తే… జయలలిత అధికారంలోకి రాగానే దాన్ని మరో ప్రజోపయోగ కార్యక్రమానికి ఉపయోగించడం ప్రారంభించారు. అసెంబ్లీని పాత దాంట్లోనే ఉంటారు. ఇప్పుడు… జగన్ కూడా… అసెంబ్లీని హైదరాబాద్ నుంచి నడుపుతారేమోనని అనుకున్నారు. పాలనను… ఏపీ సెక్రటేరియట్ నుంచి చేయరని అనుకున్నారు. కానీ ఈ విషయంలో.. మాత్రం.. జగన్ పంతానికి పోలేదు. ఏపీ సెక్రటేరియట్ నుంచి పాలన చేయాలనుకుంటున్నారు. శాఖల వారీగా పరిస్థితి తెలుసుకోవడానికి జగన్ శుక్రవారం నుంచే సెక్రటేరియట్‌కు వెళ్లనున్నారని చెబుతున్నారు. సమీక్షలు చేయనున్నారు.
ఉమ్మడి రాజధానిని ఉపయోగించుకుంటారనే ప్రచారం ఉత్తదే..!
అసెంబ్లీ సమావేశాలను కూడా అమరావతిలోనే నిర్వహిస్తున్నారు. జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రివర్గాన్ని వీలయినంత త్వరగా విస్తరించాల్సిన అవసరం పడింది. మంత్రి వర్గ విస్తరణ జూన్ 7న జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. శాసన సభ నిర్వహణ కోసం మంత్రి వర్గ అమోదం తప్పనిసరి కావడంతో తొలుత కొద్ది మందితో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. మంత్రి వర్గం ఏర్పాటైన తర్వాత కేబినెట్ భేటీలో శాసన సభను సమావేశ పరచాల్సిందిగా శాసన సభ కార్యదర్శిని కోరాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారో కూడా అసెంబ్లీ కార్యదర్శికి తెలుపాల్సి ఉంటుంది. దీంతో జూన్ 10,11 తేదీలలో ఎప్పుడైనా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారని అధికార వర్గాల చెబుతున్నాయి.
అమరావతిపై మరో ఆలోచన ఉంటే మార్పులు..?
జగన్మోహన్ రెడ్డి… ఏపీ సెక్రటేరియట్ నిర్మాణం, ఏపీ అసెంబ్లీ నిర్మాణంపై ఎన్నో ఆరోపణలు చేశారు. అలాంటి భవనాలను ఆయన అంగీకరించి.. తాను సీఎం అయినప్పటికీ.. వాటి దగ్గర నుంచే పాలన చేయాలనుకోవడం అభినందించదగ్గ విషయమే. ఇప్పటికైతే..ఆయన మనసులో.. రాజధాని పరంగా ఏముందో.. ఇప్పటి వరకూ తెలియదు. కానీ.. రాజధానిని మార్చాలనుకోవడమో..లేకపోతే.. పరిమితం చేయాలనుకోవడమో చేస్తే.. ముందు ముందు కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే.. అదే సెక్రటేరియట్, అదే అసెంబ్లీలో… జగన్ పరిపాలన నడవనుంది.