ఆరునూరైనా విశాఖనుంచి రాష్ట్రాలన్ని పరిపాలించాలని అనుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆటంకాలన్నింటినీ తనదైన శైలిలో అధిగమించాలని డిసైడ్ అయ్యారు. ముందుగా తాను విశాఖ వెళ్లి పరిపాలన చేయడానికి ఏ సమస్యలు లేవని న్యాయనిపుణులు తేల్చిచెప్పడంతో ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఇరవై మూడో తేదీ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను విశాఖకు తరలించబోతున్నారు. సీఎం ఇక రోజువారీ కార్యకలాపాలు అక్కడ్నుంచే నిర్వహిస్తారు. ఇందు కోసం ఏర్పాట్లు పుల్ స్వింగ్‌లో ఉన్నాయి. నివాస భవనాన్ని కూడా ఖరారు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆ పనులను రోజూ పరిశీలిస్తున్నారు. అప్పుడప్పుడు సమీక్షిస్తున్నారు. వైజాగ్ కు క్యాంప్ కార్యాలయం తరలింపుకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది… వెళ్తే సీఎం జగన్ మాత్రమే విశాఖ వెళ్లాలి. ఆయనతో పాటు ఇతర శాఖలు తరలించడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాలను తరలించడాన్నే హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు.. కోర్టులో ఉన్న అంశాన్ని భిన్నంగా శాఖల కార్యాలయాలను కూడా తరలిస్తే అది కోర్టు ధిక్కారం అవుతుంది. అందుకే శాఖల కార్యాలయాలను తరలించడానికి అవకాశం లేదు. అదే కొంత మంది అధికారులను కలవర పెడుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ వైజాగ్ లో ఉంటే అధికారులు అమరావతిలో ఉంటారని, సమావేశాలకు హాజరయ్యే అధికారులు అటూ ఇటూ తిరగడం కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వ వినూత్న మార్గాలను అన్వేషిస్తోంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ నివాసానికి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకమైన రహదారిని నిర్మించాలనే ఆలోచనచేస్తున్నారు. ఆ దారిలో ఒక్క సీఎంతో పాటు ఆయన కోసం వచ్చి పోయే వారి కోసమే ట్రాఫిక్ అనుమతిస్తారు. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసి.. ఎలగైనా క్యాంప్ ఆఫీసును విశాఖకు తరలించాలన్న ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత పట్టుదల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ప్రజాధనం వృధానే కానీ.. ఏ ప్రయోజనం ఉండదని కొంత మంది పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.