వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీలో ఉండబుద్ది కావడం లేదు. ఆయన ఉన్నంత సేపు నిప్పుల మీద ఉన్నట్లుగా ఉండి సందు దొరకగానే బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం వచ్చిన ఆయన తర్వాత ఒక్క రోజు ఉండి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. బెంగళూరులో పార్టీ కార్యకర్తలకు..నేతలకు అందుబాటులో ఉండరు. అత్యంత ముఖ్య నేతల్ని మాత్రమే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తెర వెనుక రాజకీయాలకు బెంగళూరు కేంద్రంగా మార్చుకున్నారు.
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే జగన్ ఏ మాత్రం పట్టనట్లుగా వెళ్లిపోయారు. అనర్హతా వేటు పడకుండా ఉండేందుకు అటెండెన్స్ కోసం అన్నట్లుగా గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. తర్వాత ఆ పని కూడా చేయడం లేదు. అసెంబ్లీలో గత ప్రభుత్వ నిర్వాకాలను ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ముందు పెడుతున్నా స్పందించే వారు ఉండటం లేదు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుని వెళ్లిపోతున్నారు.
ఓ వైపు మండలిలో బొత్స అండ్ టీం పోరాడుతోంది. వారికి నైతిక మద్దతు ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధంగా లేరు. పోరాడుతున్న వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు దిశానిర్దేశం చేసేందుకు కూడా జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పరిస్థితి చూస్తూంటే.. ప్రజల్ని జగన్ ఇంకా తేలికగా తీసుకుంటున్నారని.. కూటమిపై కోపం వస్తే తనకే ఓటు వేస్తారని..తాను కష్టపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. ఇంతకు ముందు మూడు, నాలుగు రోజులు అయినా తాడేపల్లిలో ఉండేవారు. ఇప్పుడు ఏదైనా సందర్భం వస్తేనే వస్తున్నారు. రెండు రోజులు ఉంటున్నారు.