ఈ నెల రెండో వారంలో నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్ రెడ్డి విశాఖలో తన కోసం నిర్మించుకున్న ఐదు వందల కోట్ల రూపాయల ప్యాలెస్ లో నాలుగు రోజుల పాటు కాపురం చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. అధికారికంగా ఈ ప్రకటన ఇంకా చేయలేదు. అలా చేయలేరు. ఎందుకంటే అది దొంగ దారిలో విశాఖకు వెళ్తున్న కార్యక్రమం. రుషికొండ ప్యాలెస్ పై హైకోర్టులో కేసు ఉంది. అది అక్రమ కట్టడం అని ఇప్పటికే తేల్చారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర పర్యావరణ శాఖ రెండు, మూడు వారాల్లో రిపోర్టు ఇవ్వనుంది.
ఏపీ ప్రభుత్వం అన్ని రకాల పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించి రుషికొండ ప్యాలెన్స్ ను నిర్మించింది. ముఖ్యంగా సీఆర్జెడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించింది. ఆ బిల్డింగ్ ను కూల్చివేయాలని కోర్టులు ఆదేశించినా ఆశ్చర్యం లేదు.ఎందుకంటే గతంలో ఎన్నో అక్రమ కట్టడాలను కోర్టులుకూల్చివేయించారు. అయితే అందులో ఐదు వందల కోట్ల ప్రజాధనం ఉంది. అందుకే ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
కోర్టు ఇంకా ఏమీ చెప్పకుండా ఆ అక్రమ కట్టడంలో నాలుగు రోజులు కాపురం చేయాలని జగన్ రెడ్డి నిర్ణయించారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పాటించాల్సిన ఓ ముఖ్యమంత్రి ఇలా చట్ట వ్యతిరేకంగా నిర్మించిన విలాసవంతమైన భవనంలో సేదదీరాలనుకోవడం.. దానికి విశాఖ రాజధాని అని పేరు ప్రచారం చేసుకోవడం.. ప్రజల్ని పిచ్చి వాళ్లను చేయడమే. కొసమెరుపేమిటంటే… అసలు ఎలంటి నిబంధనల ఉల్లంఘన జరగని ప్రజావేదికను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయించిన జగన్ తాను స్వయంగా అక్రమ కట్టడాన్ని కట్టించి అందులో కాపురం చేసేందుకు బయలుదేరుతున్నారు.