పూర్తి స్థాయిలో సీట్లు కట్టబెట్టిన రాయలసీమ ప్రజలు వరద కష్టాల్లో అల్లాడుతూంటే సీఎం జగన్ పెళ్లిళ్లలో విందు భోజనాలు తింటున్నారన్న విమర్శలు తీవ్రంగా రావడంతో … క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో ఆయన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని అధికార వర్గాలకు సమాచారం అందింది. ప్రతిపక్ష నేతలు ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ, బుధవారాల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పనున్నారు. ఆయన పర్యటన సజావుగా సాగుతుందా ప్రభుత్వం అడ్డుకుంటుందా అన్నది పర్యటనకు వెళ్లినప్పుడే తెలుస్తుంది.
ఇంత దారుణమైన నష్టం జరిగినందున సీఎం జగన్ పర్యటించకపోతే బాగుండదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ ఉంది. అయితే సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడం తప్ప.. ఎప్పుడూ… ప్రత్యక్షంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదు. తాను ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తుప్పుడు తీత్లీ తుఫాను వచ్చిన సమయంలో పక్కనే ఉన్నప్పటికీ ఆయన ఆజిల్లా బాధితుల్ని పరామర్శించలేదు. కానీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఇచ్చిన పరిహారం కంటే రెట్టింపు ఇస్తానని ప్రకటించారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చినా.. ఇంకా నష్టం మదింపు చేస్తూనే ఉన్నారు.. ఇంత వరకూ ఇవ్వలేదు.. అది వేరే విషయం.
అలాగే సీఎం అయిన తర్వాత కూడా విపత్తులొచ్చినప్పుడు ఆయన నేరుగా వెళ్లింది లేదు. కానీ ఈ సారి ఆయన వరద బాధిత ప్రాంతాలకు వెళ్లకపోయినా పెళ్లిళ్లకు వెళ్లి విందు భోజనాలు ఆరగించడం .., ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన వరద బాధిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే విపక్ష పార్టీలు మాత్రం అది కూడా కోర్టును ఎగ్గొట్టడానికి ఓ కారణంగా చెప్పుకుని పర్యటనకు వెళ్తారని … ప్రజలపై దయతో కాదని ఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి.