వైసీపీ ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారింది. ఓ వైపు ప్రభుత్వం పనితీరు నాసిరకంగా ఉందని కనీస సౌకర్యాల కోసం ప్రజలు డిమాండ్ చేస్తూంటే… అటు సీఎం జగన్ మాత్రం అవేమీ మాట్లాడటం లేదు. కనీసం వినిపించుకోవడం లేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని మారకుండా మార్చేస్తానని హెచ్చరిస్తున్నారు. అసలు తామేమీ చేయడానికి లేదని.. చేయలేకపోతున్నామని.. నిధుల్లేక.. వాలంటీర్లు, వార్డు సెక్రటరీలే పథకాల ప్రచారం చేసుకుంటూ ఉంటే.. తామేం చేస్తామని వారు లబోదిబోమంటున్నారు. అయితే ఇలాంటి కారణాలను జగన్ వినదల్చుకోలేదు. అయితే ఆయన ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేలే కారణం అని వారిని బలిచ్చి.. టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వారిలో వినిపిస్తోంది.
సమస్యలు వినేందుకు జగన్ విముఖత
పెట్టింది వర్క్ షాపే అయినా… అన్ని సమస్యలు విని పరిష్కారాలు చెబుతామన్నా… జగన్ ప్రసంగం వినడం తప్ప… గట్టిగా తమ సమస్యలను అడిగే అవకాశం ఇవ్వలేదు. కొంత మందికి చాన్స్ ఇస్తే వారు నేరుగా ప్రభుత్వ అవకారాల్నే ప్రశ్నించారు. అయితే ఆ తప్పులను నిజం అని ఒప్పుకోవడానికి జగన్ అంగీకరించలేదు. అదంతా మీడియా ప్రచారం అని తేలికగా తీసుకోవడమే కాదు.. ఆ సమస్యలు లెవనెత్తిన ఎమ్మెల్యేలను కసురుకున్నారు. దీంతో ఇతర ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు.
పనులు సాధ్యం కావని నేరుగా చెప్పేసిన సీఎం
బిల్లులు రావడం లేదని.. నీళ్లు.. రోడ్ల కోసం తంటాలు పడుతున్నారని… సంక్షేమ పథకాల్లో లబ్దిదారులకు కోత విధిస్తున్నారని ఇలా అనేక రకాలుగా ఎమ్మెల్యేలు సమస్యలు చెప్తే.. అవన్నీ తీసిపడేసిన జగన్‌ను చూసి ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. వాటిపైనే తమను నిలదీస్తూంటే.. అవేమీ సాధ్యం కాదని జగన్ చెప్పడంతో తాము ప్రజలకు ఏమి చెప్పుకోవాలన్న ఆలోచనలో వారు పడిపోయారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు.. ఇంకా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇలా అనేక అంశాలపై జగన్‌ది దబాయింపే కానీ.. సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు.
ప్రభుత్వం పనులు చేయకపోతే ఎమ్మెల్యేలు ఏం చేయగలరు ?
తమ వైపు నుంచి మార్చుకోవడానికి ఏముందని ఎమ్మెల్యేలు మథనపడుతున్నారు. సమస్య అంతా ప్రభుత్వం వైపు నుంచే ఉందని.. తాము ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా.. ప్రజలు అడిగిన పనులను ప్రభుత్వం చేయకపోతే ఎలా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తప్పంతా ప్రభుత్వానిది అయితే తమను నిందిస్తారేమిటని ఎమ్మెల్యే లోపల అనుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు. తమను వ్యూహం ప్రకారం బలిపశువుల్ని చేస్తున్నారని అనుకుంటున్నారు.