సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొనే నిర్ణయాలు బెడిసికొడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయకూడదని ఆయన తీసుకొన్న నిర్ణయం చాలా సరయినదని రుజువు అయ్యింది. గ్రేటర్ పరిధిలో ఎంతో బలం ఉన్న తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార తెరాస చేతిలో చిత్తుగా ఓడిపోయాయి. అంత బలమున్న ఆ మూడు పార్టీలు కూడా ‘సింగల్ డిజిట్’ కే పరిమితం అయ్యాయి. ఒకవేళ వైకాపా కూడా పోటీ చేసి ఉంటే, దానికి కూడా ఇంతకంటే అవమానకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. కానీ వైకాపా తరపున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ఎన్నికలలో పోటీ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకొన్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు వైకాపా పరువు కాపాడిందని చెప్పవచ్చును.
ఇప్పుడు తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఓటమికి కారణాలు ఏమిటి? ఎక్కడ లోపం జరిగింది? ఈ ఓటమికి పార్టీలో ఎవరు బాధ్యత వహించాలి? అని మధనపడుతుంటే, ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న వైకాపా మాత్రం చాలా నిశ్చింతగా ఉంది. అందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న సరయిన నిర్ణయమే కారణం. జగన్ తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా సరయిన నిర్ణయం తీసుకొన్నరని చెప్పవచ్చును.