అన్ని పార్టీలు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల ఆఖరి నిమిషాల్లో ఫలితాలు ఏ రకంగా మారతాయి అన్న ఉత్కంఠ ను అనుభవిస్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉండి ఈసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలి అని భావిస్తున్న వైఎస్ఆర్సిపిలో ఈ ఉత్కంఠ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే వైఎస్ఆర్ సీపీ తరపు నుండి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
పొత్తు కోసం జగన్ తీవ్ర ప్రయత్నాలు:
జగన్ తరఫున రాయబారిగా ఉన్న వ్యక్తులు జనసేన తరపున నాయకులను కలుస్తున్నారని, అసలు పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చని, పవన్ కళ్యాణ్ కి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో జగన్ తరఫు నుండి సీట్ల సర్దుబాటు ఉంటుందని వారు జనసేన నాయకులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ , వైఎస్సార్సీపీతో పొత్తు దిశగా ఏ మాత్రం ఆలోచించడం లేదని తెలుస్తోంది.
కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్, తమతో పొత్తుకు పెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ సీపీ నేతలు టిఆర్ఎస్ పార్టీ ద్వారా విపరీతమైన ఒత్తిడి చేయిస్తున్నారని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఇప్పటివరకు టిఆర్ఎస్ కానీ , వైఎస్ఆర్ సీపీ కానీ , జగన్ కానీ, కనీసం సాక్షి పత్రిక కానీ గట్టిగా ఖండించలేదు. దీంతో, జగన్ వైపు నుండి టిఆర్ఎస్ వైపు నుండి పవన్ కళ్యాణ్ ని తమతో కలుపుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న విషయం వాస్తవమే అని ప్రజలు కూడా నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను బయట పెట్టిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు ఆ ప్రయత్నాలను ఇక ఆపేస్తారేమో అని అందరు అనుకున్నారు కానీ, వైఎస్ఆర్ సీపీ ఇప్పటికీ తమ ప్రయత్నాలు మానలేదు అని ఇప్పుడు అర్థమవుతోంది. అయితే వైఎస్సార్ సీపీ నాయకులు, పవన్ కళ్యాణ్ కి పెద్దగా బలం లేదని, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే ఉద్దేశంతో పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అంతగా కావాలంటే గోదావరి జిల్లాల్లో ఏవో కొన్ని స్థానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ కి ఇస్తామని, రాష్ట్రమంతా అత్యధిక సీట్లు వైఎస్ఆర్ సీపీ మాత్రమే పోటీ చేస్తుందని వారి క్యాడర్ కి చెప్పుకుంటున్నప్పటికీ, ఆ రకంగా వైఎస్ఆర్సిపి అనుకూల మీడియా రాసుకుంటున్నప్పటికీ, వైయస్ఆర్ సీపీ నాయకులు మాత్రం జనసేన కి 50 దాకా సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే చాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.
జనసేన శ్రేణుల స్పందన:
అయితే దీనిపై జనసేన శ్రేణుల స్పందన మాత్రం భిన్నంగా ఉంది. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తాం అన్నది ముఖ్యం కాదని, తాను అనుకున్న ఐడియాలజీని పవన్కళ్యాణ్ ముందుకు తీసుకుపోయే విధానానికి తాము మద్దతిస్తామని, సీట్లు గెలిచిన గెలవకపోయినా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ టిడిపి తో కాని వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకోకుండా స్వంతంగా పోటీ చేయాలని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కూడా, ” ఒకరికి పల్లకీ మోసింది చాలు ” అని ఆ మధ్య చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం జగన్ వెంపర్లాడుతుండటం, విశ్లేషకులని సైతం విస్మయం కలిగిస్తోంది. ఇటు సాక్షి ఛానల్ , సాక్షి పత్రిక వంటి సొంత మీడియా కలిగి ఉండి, అటు కెసిఆర్ మద్దతు కలిగి ఉండి, మోడీ దృష్టికి కూడా అనుకూలంగా ఉండి, ఈ మధ్యనే తనకు కావలసిన వ్యక్తులు టీవీ9, 10 టీవీ ఛానళ్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ చానల్స్ లో కూడా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ ఉండి, ఇప్పటికీ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న శంక తో జనసేన పొత్తు కోసం ప్రయత్నించడం విశ్లేషకుల తో పాటు సామాన్య ప్రజలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మరి ఇంతకీ జనసేన తో పొత్తు కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ఫలిస్తాయా, పవన్ కళ్యాణ్ జగన్ ప్రతిపాదన అంగీకరిస్తారా అన్నది వేచి చూడాలి.