వాలంటీర్లను ఇంత కాలం ఉపయోగించుకున్న జగన్… ఎన్నికలకు ముందు వారినందర్నీ వదిలించుకుంటారన్న చర్చ జరుగుతోంది. అందు కోసం.. ఒక్క వాలంటీర్ కు పార్టీ తరపున ఇద్దరు గృహసారధుల్ని పెట్టారని ..అంటున్నారు. వాలంటీర్లను వైసీపీ అధినేత జగన్ ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ.. దానికి రివర్స్ లో ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయంటున్నారు. అందుకే గ్రామ వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్సీపీ గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో జరుగుతున్న సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశాల్లో మంత్రులు… ఇతర ముఖ్య నేతలు చేస్తున్న కామెంట్లు కూడా వాలంటీర్ల విషయంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందుతున్న అభిప్రాయాలన్ని కల్పిస్తున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు వాలంటీర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వాలంటీర్లకు క్లాస్ పీకుతున్నారు. పథకాలు ఎవరు ఇస్తున్నారంటే జగన్ ఇస్తున్నారని చెప్పాలని అంటున్నారు. పథకాలు ఇవ్వాలన్నా.. తీసేయాలన్నా వారి చేతుల్లోనే ఉంది. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం గురించి.. జగన్ గురించి చెప్పడం తక్కువైపోయిందన్న అనుమానం పార్టీ నేతల్లో బలపడుతోంది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా పథకాలు ఎవరు ఇస్తున్నారు అంటే.. వాలంటీర్ ఇస్తున్నారని చెప్పేవాళ్లే ఎక్కువ. దీంతో వాలంటీర్లు మరీ చేతికి అందకుండా పోతున్నారని కొత్తగా గృహసారధుల్ని జగన్ నియమించమని పార్టీ నేతలను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వాలంటీర్లు చేస్తున్న అంతర్గత రాజకీయానికి తోడు వారిలో కొంత మంది చేస్తున్న నిర్వాకాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఓ వాలంటీర్ పెన్షన్ కు బదులుగా దొంగ నోట్లను పంపిణీ చేశాడు. మరో వాలంటీర్ పప్పుల చిటీల పేరుతో జనాల్ని మోసం చేసి ఉడాయించింది. మరో వాలంటీర్ పెన్షన సొమ్ముతో పరారయ్యాడు. ఇలా వాలంటీర్ల గురించి వచ్చే వివాదాలు అన్నీ ఇన్నీ కావు. వీటి విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల్ని నియమించింది. వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు వాలంటీర్లను నియమించింది. వారి వల్ ప్రతీ ఇల్లూ ప్రత్యక్షంగా ఇబ్బందులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వదిలించుకోవడంపై దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతోంది.