చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను సీటు ఎలా సర్దుబాటు చేయాలనేది జగన్‌కు ఇప్పుడు పెద్ద సమస్య గా మారింది. గత ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. తర్వాత కరణం బలరాం వైసీపీలో చేరారు. ఆయనకు గట్టి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. ఆ హామీ ఏమిటంటే… తర్వాత అద్దంకి లేదా పర్చూరు ఇస్తామనే మాటలు వద్దని చీరాలలో మాత్రమే టిక్కెట్ ఇవ్వాలన్న హామీతో పార్టీలో చేరారు. ఇవ్వడానికైతే అలా ఇచ్చేశారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ కు ఎలా న్యాయం చేస్తారనేది క్లిష్టంగా మారింది.
ఆమంచి 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. అధికార నేతగా అన్నీ అనుభవించి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఆయనను చీరాల నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటి వరకూ చీరాలలో కరణంకే ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా సొంత వర్గాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తూండటంతో ఆయన జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందన్న నమ్మకం ేర్పడటంతో తనలాంటి స్టేచర్ కలిగిన నాయకుడి సీటు ఖచ్చితంగా ఇస్తారని ఆయన ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది .
ఆమంచి జనసేన వైపు చూస్తున్నారని తెలిసిన వెంటనే వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయనకు పర్చూరు సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. సీఎం జగన్ మాట్లాడదామని పిలిచారు. నిజానికి వారం రోజుల కిందట.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడ్ని పర్చూరు ఇంచార్జ్‌గా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఆమంచికి ఇస్తామని… ఆయన పక్క చూపులు చూడవద్దని సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు పర్చూరు వద్దని చీరాలే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా కూడా గెలిచానని గుర్తు చేస్తున్నారు. ఆమంచిని వదులుకోకూడదని జగన్ అనుకుంటున్నారు. కరణంను పార్టీలో తీసుకుని ఇబ్బంది పడుతున్నామని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు.