ఎన్నికల్లో ఘోర ఓటమి.. భూతాన్ని భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలతో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి టెన్షన్ పట్టుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డిపై నమోదైన కేసులు, వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న ప్రచారం జరుగుతూండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పెద్దలతో ఎలాగైనా టచ్ లోకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన తనకు ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని ఆయన ప్రతి చిన్నా చితకా నేరాన్ని రాజకీయగొడవలుగా మార్చి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రచారాన్నే ఆసరగా చేసుకుని తనకు అపాయింట్ మెంట్ ఇస్తే… అన్నీ వివరిస్తానని మోదీకి లేఖ రాశారు. జగన్ తాపత్రయం చేసి.. వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మోదీ అపాయింట్మెంట్ తీసుకుని… ఆయనను కలవడం ద్వారా కొన్ని వ్యవస్థలను ఆయన ప్రభావితం చేసే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. తనపై మోదీకి ఇంకా అభిమానం ఉందని చెప్పాలనుకుంటున్నారని భావిస్తున్నారు.
ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై కేంద్రం వద్ద పూర్తి సమాచారం ఉంటుంది. ఆయనను మళ్లీ మోదీ ప్రోత్సహిస్తారని అనుకోవడం లేదని.. రాష్ట్ర రాజకీయ అంశాల్లో ఫిర్యాదులు చేయడానికి ప్రతిపక్ష నేతకు ప్రధాని ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జగన్ అలాంటి వ్యతిరేక కారణాలతోనే అపాయింట్ తెచ్చుకుని తన పలుకుబడిని చూపించాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.