అమరావతి, సన్నబియ్యం, 45 ఏళ్ల పెన్షన్లు వంటివిషయాల్లోనే కాదు.. చివరికి సీబీఐ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిది ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాట ఒకటి.. అధికారంపక్షంలోకి మారిన తర్వాత మరొకటి. వివేకా హత్య కేసే దీనికి నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిందేనని కోర్టుల్లో తాను స్వయంగా పిటిషన్లు వేయడమే కాక.. వైఎస్ వివేకా భార్య పిల్లలతోనూ పిటిషన్లు వేయించారు జగన్మోహన్ రెడ్డి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే.. స్వయంగా ప్రభుత్వ లాయర్ చేత.. సీబీఐ విచారణకు ఇవ్వొద్దని.. న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేయించాల్సి వచ్చింది.
వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. గతంలో జగన్మోహన్ రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఇటీవలి కాలంలో అదే డిమాండ్ తో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టులో జరిగిన విచారణలో.. ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడాన్ని నిర్మోహమాటంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. ఇలాంటి సమయంలో.. సీబీఐకి ఇవ్వడం మంచి కాదనేది.. ఏజీ ఉద్దేశం. నిజానికి సిట్.. విచారణలో ఏ మాత్రం పురోగతి సాధించలేదు. ఈ విషయం దాదాపుగా పదిహేను వందల మందిని అనుమానితులగా పేర్కొన్నప్పుడే స్పష్టమయింది. ఈ కేసును వీలైనంత వరకూ సాగదీసి.. చివరికి ఏటూ తేల్చకుండా పోలీసులు చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి గతంలో చంద్రబాబునాయుడు సీబీఐని.. ఏపీలో ఎంటర్ కాకుండా.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అప్పట్లో బీజేపీతో జరిగిన పోరాటంలో… ఐటీ దాడులు.. జోరుగా సాగాయి. ఆ క్రమంలో సీబీఐ కూడా రెడీ అయిందన్న ప్రచారం జరగడంతో.. జనరల్ కన్సెంట్ ను చంద్రబాబు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాగానే.. జనరల్ కన్సెంట్ను పునరుద్ధరించింది. వెంటనే.. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు విచారణ జరపాలంటూ.. సిఫార్సు చేసింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు.. హైకోర్టు వివేకా హత్య కేసును సీబీఐకి ఇస్తే మాత్రం.. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి ఇస్తే.. తమ జుట్టు మరోసారి కేంద్రం చేతుల్లోకి వెళ్తుందేమోనని.. వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నారని.. అందుకే కేసు విచారణను సీబీఐకి ఇవ్వవొద్దంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.