జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులకు ప్రభుత్వం మారకుండానే చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్డగోలు పనులు చేయించుకున్న ప్రభుత్వమే తప్పనిసరిగా సస్పెండ్ చేయాల్సి వస్తోంది. వారు కూడా కాపాడలేకపోతున్నారంటే.. ఇక తాము ఎవరికి వ్యతిరేకంగా పని చేశామో… వారు అధికారంలోకి వస్తే ఊరుకుంటారా ?. చేసిందే తప్పుడు పని.. అదీ కూడా తమకు వ్యతిరేకంగా చేశారని స్పష్టమైన ఆధారాలున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఊరుకుంటుందా ?. జీవితంలో తప్పు ఎందుకు చేశామా అని పొర్లి పొర్లి ఏడ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి ట్రీట్ మెంట్ .. రెండు నెలల తర్వాత ఏపీలో ఎంత మంది జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులకు ఉంటుందో అంచనా వేయడం కష్టం.
ఏపీలో కొంత మంది అధికారులు పూర్తి స్థాయిలో అడ్డదారిలో ఉన్నారు. కాస్త నిజాయితీగా పని చేసే వారు ఐదేళ్లుగా లూప్ లైన్ లో ఉన్నారు. తాము చెప్పినట్లుగా పని చేసే వారికి మాత్రం ఒకటికి నాలుగు పోస్టులు ఇచ్చి వారి పేరుతో సలహాదారులు అరాచకాలు చేస్తున్నారు. వారంతా ఇప్పుడు ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. తిరపతి ఉపఎన్నిక సమయంలో చిత్తూరు కలెక్టర్ గా ఉన్న అసలు అధికారి ఇప్పటికే నిండా కూరుకుపోయారని అంటున్నారు. త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు.
ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బయటపడే వీరి నిర్వాకాలు.. ఐఏఎస్ అధికారులు ఎలా పని చేయకూడదనేదానికి కేసు స్టడీల్లా ఉండబోతున్నాయని అంటున్నారు. సమాజంలో గొప్పగా చూసే అధికారులు.. ఎంత ఘోరంగా ట్రీట్ మెంట్ పొందబోతున్నారో కూడా అర్థమవుతుందని అంచనా వేస్తున్నారు. చేసిన తప్పుడు పనులకు … ప్రజల ముందు వారికి పడే శిక్షలు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. అధికారంలో ఉండి తప్పులు చయించిన వారే కాపాడలేకపోవడమే జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంచనా వేయవచ్చు