రాష్ట్ర ఎన్నికల సంఘం, ముఖ్యమంత్రి జగన్ కు ఝలక్ ఇచ్చింది. ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు గా ప్రకటించింది. దీంతో హుటాహుటిన జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయ్యారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం పై జగన్ తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లుగా సమాచారం. వివరాల్లోకి వెళితే..
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. పలు దేశాలు వైరస్ కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల పేరిట జనం ఒక చోట గుమిగూడే అవకాశాన్ని కల్పిస్తే, అది వైరస్ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉందన్న వాదన మొదటి నుండి కూడా ఉంది. దీనికి తోడు పలు చోట్ల విపక్ష నాయకులు నామినేషన్లు వేయకుండా అధికార వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేయడం, వారి నామినేషన్ పత్రాలను చించివేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. టిడిపి నేతల వాహనాలు ధ్వంసం చేయడం కూడా తెలిసిందే. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు గా ప్రకటించింది. అయితే ఇప్పటికే వేసిన నామినేషన్లు, ఏకగ్రీవాల విషయంలో యథా తథ పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. అయితే స్థానిక ఎన్నికల వాయిదా అధికార పార్టీకి గట్టి ఝలక్ అని చెప్పవచ్చు. పైగా తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వాయిదా వేయడంపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయడానికి కేవలం కరోనా వైరస్ మాత్రమే కారణం కాదని, అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నామినేషన్ పత్రాలను చించేయడం వంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి రణరంగంగా మారిన గ్రామాలలో పరిస్థితి కొంత కాలంపాటు సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.