అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు దానికి చిన్న సవరణను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారు. అదేమిటంటే… సీపీఎస్ గురించి తెలియకుండానే సీఎం జగన్ హామీ ఇచ్చారట. ఈ కవర్ డ్రైవ్ బ్యాటింగ్‌ను సజ్జల ప్రారంభించారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ఎదుట చెప్పారు.
సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి… వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ప్రకటించారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ ఎందుకు చేయడం లేదన్నదానికి మరో కవర్ డ్రైవ్ వాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. దానికి సుప్రీంకోర్టును అడ్డు పెట్టుకున్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనని కానీ.. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏమైనా చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు అవరోధం అయిందని చెప్పుకొచ్చారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సి ఉందన్నారు. సీపీఎస్ రద్దు చేయకపోతే తఢాఖా చూపిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటన లు చేస్తున్న సమయంలో .., అసలు ఆ హామీ పొరపాటున ఇచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ఇప్పుడు సంచలనం అయ్యే అవకాశం ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కూ హ్యాండిచ్చారు. వారి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.