వైఎస్ కుటుంబంపైనా కొడాలి నాని తన మార్క్ భాషా ప్రయోగం చేస్తున్నారు. వైఎస్ జగన్ సోదరి సునీత, బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఘటన కేసు విషయంలో జగన్ ను వెనకేసుకు వచ్చేందుకు ఆయన ప్రయోగించిన భాష… వైఎస్ కుటుంబం మొత్తాన్ని కించపరిచేలా ఉంది. కుటుంబంలో ఏం జరిగినా పరువు కాపాడుకోవాల్సిన పెద్దలు కొడాలి నాని లాంటి వారికి స్వేచ్చనిచ్చి… తమ కుటుంబంపైనే ఇష్టారీతిన మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలతో జగన్ భేటీ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. మాట్లాడిన భాష విన్న వారెవరికైనా… జగన్ అనుమతి లేకుండా ఇలాంటి భాష మాట్లాడతారా అనే డౌట్ రాకుండా ఉండదు.
వివేకా చచ్చినా బతికినా అంటూ ప్రారంభించి.. .. దినం ఖర్చులు.. కాఫీ ఖర్చులూ అంటూ చెలరేగిపోయారు. వివేకాను హత్య చేయడం వల్ల ఆస్తులు ఆయన భార్యా, పిల్లలకు వెళ్లాయని అంటే లబ్దిదారులు వాళ్లేననని చెప్పుకొచ్చారు. వివేకా జగన్ ను నాశనం చేయాలనుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. కొడాలి నాని మాటలు చాలా మందికి ఆశ్చర్యం కలిగించలేదు కానీ.. వైఎస్ కుటుంబంపై అభిమానం ఉన్న వారిని మాత్రం తీవ్రంగా బాధిస్తూంటాయి. వివేకా హత్యకు గురవడంలో తప్పు లేదు.. అవినాష్ రెడ్డికి అండగా ఉండాల్సిందేనన్నట్లుగా కొడాలి నాని సమర్థించుకున్నారు. ఇది జగన్ సమర్థనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చట్టం , న్యాయం అనేదే లేదు.. కేవలం తమను వ్యతిరేకించారన్న కారణంగా వివేకాను ఏం చేసినా తప్పు లేదన్నట్లుగా సమర్థించుకుంటున్నారు.
వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. చివరికి హత్యలు జరుగుతున్నాయి. అందర్నీ ఏక తాటిపైకి ఉంచడంలో… అందర్నీ ఉపయోగించుకుని పదవిలోకి వచ్చిన సీఎం జగన్కు సాధ్యం కావడం లేదు. ఆయనే కుటుంబాన్ని విభజించుకున్నారు. ఇప్పుడు తనకు ఇష్టం లేని వర్గంపై కొడాలి నాని వంటి వాళ్లతో కూడా బాతులు తిట్టిస్తున్నారు. ఇది అంతిమంగా కుటుంబంలో విభజనకు దారి తీస్తుంది. దాని వల్ల ఎవరు నష్టపోతారో కూడా అందరికీ తెలుసు. తెలుసుకోలేనిది ఒక్కరే.