అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ ముందుకెళ్లాలనే దృక్పథంతో దీన్ని ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్ధిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. వీటిలో తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష ఉంటుంది.
తొలి రోజు.. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమం, 26న వ్యవసాయం, అనుబంధ రంగాలు, 27 విద్యారంగ సంస్కరణలు, పథకాలు, 28 పరిశ్రమలు, పెట్టుబడుల రంగం, 29 ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీపై చర్చిస్తారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టి 30వ తేదీకి ఏడాది అవుతుంది. ఆ రోజున సంబరాలు నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో ప్రజలను జగన్మోహన్ రెడ్డి నేరుగా కలుసుకోలేకపోయారు. అనేక రకాల అవాంతరాలు వచ్చాయి.
ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. పాలనలో ప్రజలందర్నీ భాగం చేసి.. స్వయంగా వారితో మాట్లాడేలా.. ఈ మేథోమథన కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ప్రజల నుంచి సలహాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రజల కోసమే.. పథకాలు రూపొందిస్తానని.. వారి అవసరాలు తీర్చేలా చూస్తానని చెబుతూంటారు. అలాగే.. కొత్త పథకాలు రూపకల్పన.. పాత పథకాల్లో మార్పు వంటి వాటిని.. ఈ మేధోమథనం ద్వారా పూర్తి చేసే అవకాశం ఉంది.