ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నుంచి వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు తాను రానంటే రానంటూ తెగేసిచెప్పిన జగన్ ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీకి లేఖరాస్తూ, గన్నవరంలోగానీ, లేదా తిరుపతిలోగానీ కలుసుకునే అవకాశం ఇవ్వమని రాశారు. అయితే ఈలేఖకు ఇంతవరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పందనరాలేదు. కబురుకోసం జగన్ కళ్లలో వొత్తులువేసుకుని ఎదురుచూస్తున్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన రాజకీయాలకు అతీతంగా సాగే పండుగ అయినప్పటికీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు శంకుస్థాపన ఉత్సవాన్ని పండుగతో పోల్చారు. అక్టోబర్ 22న మన రాష్ట్ర ప్రజలకు రెండు పండుగలు ఒకేరోజు వస్తున్నాయనీ, ఒకటి విజయదశమికాగా, మరోకటి అమరావతి శంకుస్థాపన ఉత్సవమంటూ చెప్పుకొచ్చారు. కానీ జగన్ మాత్రం తాను శంకుస్థాపన ఉత్సవానికి రానంటూ కచ్చితంగా తేల్చిచెప్పారు. ఆయనను కలవడానికి టిడిపీ నేతలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవన్నీ విఫలమయ్యాయి.
అయితే, ఇప్పుడు జగన్ ఆలోచనల్లో కొద్దిగా మార్పువచ్చినట్లు కనబడుతోంది. ఏ చిన్నపాటి సందుదొరికినా అమరావతికి వెళ్ళాలనే ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన వద్ద ఉన్న ఏకైక ఆధారం, ప్రధాని నుంచి పిలుపురావడమే. తనకు రాజకీయంగా చంద్రబాబు శత్రువేకానీ, మోదీ కాదన్నది ఆయన అభిమతం. అందుకే మోదీ నుంచి తన లేఖకు స్పందన వస్తే ఆయనను కలిసి ఏపీహోదా గురించి తన డిమాండ్ తెలియజేయాలనుకుంటున్నారు.
కాగా, గన్నవరంలో కుదరని పక్షంలో అమరావతిలోనైనా కాసేపు మాట్లాడేఅవకాశం ఇచ్చినా అక్కడికైనా వెళ్ళేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో విధంగా అమరావతికి వెళ్ళి ఏపీహోదా కోసం మాట్లాడి తన పరువు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.