ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు చేసుకోకుండానే ఢిల్లీ చేరుకున్నారు. ఫలితంగా ఉదయమే హస్తిన చేరుకున్న ఆయన సాయంత్రం వరకూ తనను కలవడానికి వచ్చిన వారితో భేటీ అవుతూ టైంపాస్ చేశారు. ఢిల్లీ పర్యటన ఉండటమే… ఉదయమే పోలీసుల అమరవీరుల సంస్మరణ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం సమయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. ఢిల్లీకి వస్తారని.. ఆయనను కలవడానికే.. హుటాహుటిన జగన్.. హస్తిన చేరుకున్నారని వైసీపీ వర్గాలు చెప్పాయి. అయితే.. జగన్ ఢిల్లీకి చేరుకున్నప్పటికీ.. అమిత్ షా కార్యాలయం నుంచి .. ఎలాంటి సమాచారం రాలేదు. ఎంత రాత్రి అయినా అమిత్ షా సమయం ఇస్తారని.. కలవాలన్న పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
న్యాయశాఖ మంత్రితోనూ సమావేశమవ్వాలన్న ఉద్దేశంతో.. ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా ఏపీ భవన్ వర్గాలు ప్రయత్నించాయి. కానీ.. ప్రయోజనం లేకపోయింది. ఈ లోపు.. జలశక్తి మంత్రితో పోలవరం అంశాలపై చర్చించాలనుకున్నారు. సాయంత్రం వరకూ అక్కడి నుండీ సమాచారం అందలేదు. దాంతో.. జగన్మోహన్ రెడ్డి ఖాళీగానే ఉండాల్సి ఉంది. ఇతర కేంద్రమంత్రులను కలవాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. అమిత్ షాను కలవడం.. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఈ రోజు కాకపోతే.. రైపైనా ఆయనతో సమావేశం అవ్వాలన్న లక్ష్యంతోనే … జగన్ రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అమిత్ షా.. గతంలో … మోడీతో జగన్ సమావేశం అయినప్పుడే అపాయింట్ మెంట్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండు గంటల ఆలస్యంగా ఢిల్లీ చేరుకున్నారు. ఆ కారణంగా అమిత్ షా వెళ్లిపోయారు.
అప్పట్నుంచి.. మళ్లీ మళ్లీ ట్రై చేస్తున్నా.. జగన్ కు అపాయింట్ మెంట్ దక్కడం లేదు. ఈ సారి మాత్రం మిస్ కాకూడదని… జగన్ అనుకుంటున్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్నికలు పూర్తవడంతో.. అమిత్ షా రిలాక్స్ అవుతారని… తనకు సమయం ఇస్తారని జగన్ ఆశతో ఉన్నారు. ఇంత అర్జెన్సీగా… పడిగాపులు పడి మరీ అమిత్ షాతో భేటీ అయి.. చర్చించాల్సిన అంశాలేమిటన్నదానిపై.. ఏపీ ప్రభుత్వం అధికారికంగా.. ఒక్క మాట కూడా బయటపెట్టలేదు.