ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏదో రాజకీయం చేయడానికి తంటాలు పడుతున్నారు. తాను కూడా ఢిల్లీలో పెద్దలతో భేటీలు అయి రాజకీయాన్ని మార్చగలనని కూలీ మీడియాలో ప్రచారం చేయించుకోవాలనుకుంటున్నారేమో కానీ .. అసలు ఢిల్లీలో ఆయనకు ఇంకా ఎవరి అపాయింట్మెంట్లు దక్కలేదు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి కూలి మీడియా కాసేపట్లో అమిత్ షాతో భేటీ అని ప్రచారం చేసింది. రాత్రి పది గంటల తర్వాత అమిత్ షా కొన్ని రాజకీయ సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం స్థాయి వ్యక్తి అడిగారు కాబట్టి సమయం ఇస్తారని అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. దాంతో కూలీ మీడియా ప్రయాస అంతా వృధా అయింది . భేటీ జరగలేదు.
ప్రధానమంత్రితో సమావేశం ఖరారయిందా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ప్రధానమంత్రితో పదకొండు గంటలకు భేటీ ఉంటుందని చెబుతున్నారు. అమిత్ షాతో సమావేశం కోసం జగన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారికి తిరస్కరించలేని ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారేమో కానీ అత్యున్నత వర్గాల ద్వారా ప్రభుత్వానికి సంబంధం లేని.. బీజేపీ అగ్రనేతలకు సన్నిహితులైన వారి ద్వారా అపాయింట్మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అమిత్ షా సమయం ఇస్తారో లేదో స్పష్టత లేదు. ప్రధానితో భేటీ పైనా అంతే.
కొంత మంది కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. వారి వద్దకు వెళ్లడానికి అపాయింట్మెంట్లు అవసరం లేదు. పైగా కొంత మంది శ్రేయోభిలాషి కేంద్ర మంత్రులు… వారి దగ్గరకు తీసుకెళ్లే బీజేపీ నేతలు ఉండనే ఉన్నారు. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే జగన్ ఢిల్లీలో చేసిన.. చేస్తున్న రాజకీయం మాత్రం…తేడాగానే ఉంది. అంత పడిగాపులు పడాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వినిపించేలా చేస్తోంది.