“జనం వెల్లువలా వస్తూండటంతో.. అందర్నీ పేరు పేరునా పలకరిస్తూ వెళ్తున్నా..! అందుకే పాదయాత్ర లేటవుతోంది…” కొద్ది రోజుల క్రితం.. ఓ తెలుగు న్యూస్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. మూడు వేల కిలోమీటర్లను ఆరు నెలల్లో పాదయాత్రగా పూర్తి చేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఏడు నెలలు గడిచిపోయినా.. ఇంకా … తూర్పుగోదావరి జిల్లాలోనే పాదయాత్ర ఉంది. అంటే.. అనుకున్నదానికంటే.. ఎంతో ఆలస్యం అవుతోంది. దీనికి కారణం ప్రజలే అని… జగన్ చెబుతున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరే ఉంది.
జగన్మోహన్ రెడ్డి… ఆదివారం కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ నుంచి… పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం సాయంత్రానికి ఆయన గణపతి నగర్ చేరుకుంటారు. ఈ రెండింటి మధ్య దూరం పదకొండు కిలోమీటర్లు. అంటే జగన్ రెండు రోజుల్లో కేవలం పదకొండు కిలోమీటర్ల మేర మాత్రమే పాదయాత్ర చేస్తున్నట్లు లెక్క. మంగళవారం బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది కాబట్టి.. ఆయన ఎలాగూ పాదయాత్ర వాయిదా వేస్తారు. బుధవారం.. మరో ఆరేడు కిలోమీటర్లు నడుస్తారు. గురువారం.. ఒకటో..రెండో కిలోమీటర్లు నడిచి… రాజమండ్రి విమాశ్రయానికి వెళ్లి.. ఫ్లైట్ ఎక్కేస్తారు. శుక్రవారం కోర్టుకెళ్లే పని ఉండటంతో… గత కొద్ది రోజులుగా.. గురువారం ఉదయమే హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. అంటే పాదయాత్రను జగన్ చాలా ఆషామాషీగా చేస్తున్నారు. ఓ పాదయాత్రలా కాకుండా..మార్నింగ్, ఈవినింగ్ వాక్ల్లా చేస్తున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.
ఫిట్నెస్ కోసం ఆఫీసుల్లో కూర్చుని పని చేసేవాళ్లు .. రోజుకు ఐదారు కిలోమీటర్లు.. వాకింగ్, జాగింగ్ చేస్తూంటారు. ఇక కాయకష్టం చేసుకునేవాళ్లు అంత కంటే ఎక్కువగానే పనిలో భాగంగా నడుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఆ మాత్రం కూడా కష్టపడకుండానే… ప్రజల కోసం పాదయాత్ర అంటూ హడావుడి చేస్తున్నారని టీడీపీ నేతలు చాలా రోజులుగా విమర్శిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ జగన్ ప్రతి రోజూ… ఎంత ఎంత దూరం నడిచారనే అప్డేట్ సాక్షి మీడియాలో ప్రముఖంగా కనిపించేది. అప్పుడు రోజుకు కనీసం పది కి.మీ నడిచేవారు. కానీ ఇటీవలి కాలంలో.. దూరం గురించి చెప్పకుండా.. ఫలానా ఊరి నుంచి ఫలానా ఊరి వరకూ పాదయాత్ర చేశారని రాసుకొస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ… చంద్రబాబు కానీ… చివరికి షర్మిల కూడా… పాదయాత్రను నిరాటకంకంగానే కొనసాగించారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే తప్ప ఆపలేదు. కానీ జగన్ మాత్రం.. దీనికి భిన్నంగా పాదయాత్ర చేస్తున్నారు. బందులు, కోర్టు హాలీడేలు పోను.. కరిగిపోయే కెలోరీలు చూసుకుని మరీ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల్లో నిలిచిన పాదయాత్ర స్ఫూర్తిని కొనసాగించలేకపోతున్నారు.