అమరావతి విషయంలో ఏపీప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు బయటకు వచ్చాయి. హైకోర్టు నిర్దేశించిన కాలపరిమితిలోపు అభివృద్ధి సాధ్యం కాదని చెబుతూ.. ఎప్పట్లోపు ఏఏ పనుల చేస్తామో అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒక్కో పనికి ఒక్కో సమయం చెప్పింది. అయితే చివరికి అమరావతి అభివృద్ధికి రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అరవై నెలలు పడుతుందని తేల్చారు. గత ప్రభుత్వం దాదాపుగా రూ. నలభై ఒక్క వేల కోట్లతో పనులు ప్రారంభించిందని.. వాటిని మళ్లీ ప్రారంభించాలంటే బ్యాంకులు రుణాలివ్వాలన్నారు. కానీ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదన్నారు.
ఇక విషయం ప్రభుత్వం అన్నీ రెడీగా ఉన్న రాజధానిని కట్టడానికి అరవై నెలల సమయం అడుగుతుంది. కానీ గత ప్రభుత్వం మొదటి నుంచి ప్రారంభించి రాజధానిలో ఐదేళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది. అక్కడ్నుంచే పాలన సాగేలా చేసింది. ఇక రాష్ట్ర రాజధాని అంటే ఐకానిక్‌లా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త భవనాలను డిజైన్ చేయించింది. అయితే ఐదేళ్లలో రాజధాని కట్టలేదంటూ అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని విషయంలో ఏమైనా మాట్లాడాల్సి వస్తే వచ్చే మొదటి మాట అదే. ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని కట్టలేకపోయాడనేదే. ఇలాంటి దుష్ప్రచారాలు.. అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేదన్న ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.. కానీ అక్కడజరిగిన అభివృద్ధిని పనులను మాత్రం చెప్పలేకపోయారు.
ఇప్పుడు తమదాకా వచ్చే సరికి… కోర్టుకుచెప్పుకోవడానికే అరవై నెలల సమయం అడిగారు. డ్రైనేజీలుపూర్తి స్థాయిలో రెడీ చేయడానికే మూడేళ్ల సమయం పడుతుందన్నారు. నిజానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. పనులన్నీ ఎక్కడివక్కడ ఆపేశారు. కొనసాగించి ఉంటే అమరావతికి ఇప్పటికే ఓ రూపు వచ్చేది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని సమర్థించుకుంటూ ఇంత కాలం.. కాలం గడిపేశారు. ఇప్పుడు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలేసరికి.. సీఆర్డీఏ చట్టం ప్రకారం ఒప్పందాన్ని అమలు చేయాలని తీర్పు చెప్పే సరికి.,. తమకు రాజధాని కట్టడానికి చాలా సమయం కావాలని కాళ్ల బేరానికి వచ్చేశారు. ఇతరులు చిటికెలో చేయాలి… తమకు మాత్రం సాధ్యం కాదని పాలకులు చెప్పకనే చెప్పారు. ఇలాంటి రాజకీయాల వల్ల నేతలు బాగుపడ్డారు కానీ.. ప్రజలు. .. రాష్ట్రం దారుణంగా నష్టంపోయింది.