వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల తేనె తుట్టె మళ్ళీ కదిలినట్లుంది. హైదరాబాద్ సిబిఐ కోర్టులో అతని కేసులపై విచారణ సాగుతున్న సమయంలోనే, డిల్లీలోని ఎన్ఫోర్స్ మెంటు డిపార్టుమెంటు కోర్టు కూడా ఈ కేసులపై సమాంతరంగా విచారణకు సిద్దం అవడంతో ఈ కేసులలో ఏ-1, ఏ-2 ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు.
సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా మళ్ళీ సమాంతరంగా ఈడీ కోర్టులో కూడా అదే కేసుల మీద విచారణ జరగడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని, అది తమ హక్కులను హరించడమే అవుతుందని జగన్ తరపున న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డి వాదించారు. కనుక సిబిఐ విచారణ ముగిసే వరకు ఈడి కోర్టు తన విచారణను నిలిపివేయవలసిందిగా ఆదేశించాలని హైకోర్టుని అభ్యర్ధించారు.
దీనికి ఈడి తరపున వాదిస్తున్న న్యాయవాది అభ్యంతరం తెలిపారు. “ఒకే కేసుపై ఒకేసారి రెండు వేర్వేరు న్యాయస్థానాలలో విచారణ జరుగకూడదనే నియమం ఎక్కడా లేదు. ఈవిధంగా రెండు చోట్ల వేర్వేరుగా విచారించవద్దని కోరుకొంటున్నట్లయితే సిబిఐ కేసులనన్నిటినీ కూడా ఈడి కోర్టుకే బదిలీ చేయాలని” ఈడి న్యాయవాది కోరారు. అందుకు జగన్ తరపున న్యాయవాది కూడా అంగీకరించారు.
సిబిఐ కేసులను ఈడి కోర్టుకు బదిలీ చేయాలని ఇరు పక్షాల వాదోప వాదనలు విన్న తరువాత సిబిఐ కోర్టులో ఉన్న కేసులను అన్నిటినీ ఈడి కోర్టుకు బదలాయించడంపై ఈ నెల 29లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయవలసిందిగా సీబీఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేసి ఈ కేసు విచారణను ఆరోజుకి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో.
జగన్ కేసులను ఈడి కూడా సమాంతరంగా విచారించాలనుకొంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తన కేసులను ఈడి కోర్టుకి బదిలీ కావాలని ఎందుకు కోరుకొంటున్నారో తెలియదు. ఈ కేసుల నుండి బయటపడేందుకు బహుశః డిల్లీ స్థాయిలో ఏమయినా చక్రం తిప్పుతున్నారా అనే అనుమానించవలసి వస్తోంది.