ఏపీ సీఎం జగన్ రెడ్డి జగన్ రెడ్డి తాను ఏం చేస్తున్నారో విచక్షణ కోల్పోతున్నారు. చివరికి టీడీపీ మేనిఫెస్టో లో ప్రకటించిన హామీల్ని తానే ముందు అమలు చేయాలనుకుంటున్నారు. మేనిఫెస్టోను అదే పనిగా పొగుడుతున్నట్లుగా సభల్లో ప్రస్తావిస్తున్న ఆయన ఇప్పుడు.. వాటిలో కొన్ని అమలు చేయాలనుకుంటున్నారు. మహిళల్ని ప్రధానంగా ఆకర్షిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తు చేశారు.
కర్ణాటకలో సూపర్ హిట్ అయిన ఈ పథకాన్ని తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ హామీగా ఇచ్చింది. ఆ సమయంలో కేసీఆర్ కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారు. కానీ ఎందుకో అమల్లోకి తీసుకు రాలేదు. దీనికి కారణం తాము అమలు చేస్తే.. అది తమకు మేలు చేయకపోగా.. మరింత మైనస్ చేస్తుందని… కాంగ్రెస్ వల్లే ఈ పథకాన్ని తెచ్చారన్న ప్రచారం ఊపందుకుంటుందని.. అంటే.. ఆ పార్టీ ప్రకటించిన పథకాలన్నీ అమలు చేయదగ్గవేనని ప్రజలు నమ్ముతారని అందుకే సైలెంట్ అయిపోవడం మంచిదని ఊరుకున్నారని చెబుతున్నారు.
అయితే జగన్ రెడ్డి మాత్రం అమలు చేయాలనుకుంటున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఇప్పటికీ దీనిపై ఏపీలో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ కూడా అమలు చేస్తే..తమకే ఎక్కువ ప్రచారం వస్తుందని అనుకుటోంది. అందుకే అమలు చేసే వరకూ… ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలని అనుకుంటోంది.