గడప గడపకూ వెళ్లని ఎమ్మెల్యేలు సగం మంది ఉంటారు. మొదట్లో ఈ సగం మంది గురించి చెప్పిన జగన్. .. చివరికి వారి సంఖ్యను పద్దెనిమిదికి తగ్గించారు. మిగతా వారిని ఏమీ అనలేక.. ఈ పద్దెనిమిది మంది పేర్లు బయట పెట్టలేదు. కానీ.. ఆయన ఆ పద్దెనిమిది మందికి ఐ ప్యాక్ ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ఒక శాసన సభ్యుడి పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని.. ఆయనకు నేరుగా ఐ ప్యాక్ టీమ్ చెప్పిందని అంటున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మరో మాజీ మంత్రి, ఒక ప్రస్తుత మంత్రికి జగన్ టిక్కెట్ ఇచ్చే ఉద్దేశంలో లేరని అంటున్నారు. వారు అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, పశ్చిమగోదావరి నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జాబితాలో ఉన్నారని చెబుతున్నారు.
కృష్ణా జిల్లా నుంచి గతంలో పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ ఎమ్మెల్యే పెద్దగా తిరగడం లేదు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉననారు. ఇక గుంటూరు జిల్లా నుంచి మాజీ మహిళా మంత్రి కూడా తిరగడం లేదు. ఆమె భర్తకు ఇటీవల పదవి ప్రకటించారు. ప్రకాశం జిల్లా నుంచి ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా జాబితాలో ఉన్నారు. మాజీ మంత్రి బాలినేనికి టిక్కెట్ డౌటేనని చెబుతున్నారు నెల్లూరు జిల్లా నుంచి అధిష్టానం పై అసంతృప్తి తో ఉన్న ఒక మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యే ఉన్నారని, అనంతపురం నుంచి ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల పని తీరు పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కర్నూల్,చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే కి ఇప్పటికే ఫోన్ కాల్స్ వెళ్ళాయని అంటున్నారు.
అయితే వీరి పేర్లను బయటపెడితే….మిగతా వారు గొప్పగా తిరుగుతున్నారా అని ఎదురుదాడి చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో… ప్రస్తుతానికి ఐ ప్యాక్ తెర వెనుక హెచ్చరికలతో సరిపెడుతున్నట్లుగా చెబుతున్నారు.