వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తలనరుకుతానని బహిరంగంగ హెచ్చరిస్తుంది. మరో ఎమ్మెల్యే రోజా శాసనసభలోనే నేరుగా ముఖ్యమంత్రిపైకి దూసుకువెళ్ళి దుర్బాషలాడుతుంది. జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసులనే అందరి ఉద్యోగాలు ఊడగొట్టిస్తా కబడ్ధార్! అని బెదిరిస్తారు. అది కూడా పొరుగు రాష్ట్ర పోలీసులని! ఇదీ వైకాపా నేతల తీరు!
ఈరోజు ఉదయం వైకాపా ఎమ్మెల్యే రోజా శాసనసభలోని వైకాపా కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించినపుడు పోలీసులు ఆమెను వారించారు. అయినా ఆమె మొండిగా లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ సంగతి తెలిసి అక్కడికి చేరుకొన్న జగన్మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో ఘర్షణ పడ్డారు. తమ ఎమ్మెల్యే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోర్టుకి వెళ్లి అందరి ఉద్యోగాలు ఊడగొట్టిస్తానని హెచ్చరించారు. ఆమెను నాంపల్లి స్టేషన్ నుంచి నీమ్స్ ఆసుపత్రికి పోలీస్ వ్యాన్ లో తరలించాలని ప్రయత్నిస్తుంటే, అంబులెన్స్ లో మాత్రమే తరలించాలని జగన్ పట్టుబట్టారు. దానితో తప్పనిసరిగా అంబులెన్స్ రప్పించి ఆమెను దానిలో నీమ్స్ కి తరలించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పోలీసుల పట్ల ఈవిధంగా వ్యవహరించడం చాలా తప్పు. ఒకవేళ నాంపల్లి పోలీసులు జగన్ తమతో దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై కేసు నమోదు చేసినట్లయితే అది మరో సమస్య అవుతుందనే సంగతి ఆయనకు తెలియదనుకోవాలా లేకపోతే పోలీసులు తనను ఏమీ చేయలేరనే అహంకారమనుకోవాలా? పార్టీలో వారికీ మార్గదర్శకత్వం చేయవలసిన జగన్మోహన్ రెడ్డే ఈవిధంగా వ్యవహరిస్తుంటే ఇంక ఈశ్వరి, రోజా వంటి ఎమ్మెల్యేలు వేరేవిధంగా ఎందుకు వ్యవహరిస్తారు?