కృష్ణాబోర్డు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణ సర్కార్ విషయంలో సుతిమెత్తగా వ్యవహరిస్తూ ఏపీ విషయంలో అత్యంత కఠినంగా బోర్డు ఉంటోందని భావిస్తున్నారు. అందుకే… తాడో పేడో అన్నట్లుగా కృష్ణాబోర్డుతో తేల్చుకోవాలని జగన్ డిసైడయినట్లుగా కనిపిస్తోంది. అందుకే… ఈ అంశంపై జరిగిన సమీక్షలో అధికారులకు మొహమాటలేమీ పెట్టుకోవద్దని నేరుగానే చెప్పేశారు. ఏపీపై కృష్ణా రివర్ బోర్డు వివక్ష చూపుతోందని.. తమను పట్టించుకోకుండా.. తెలంగాణాపై సానుభూతి చూపుతుందన్న అంచనాకు ముఖ్యమంత్రి జగన్ వచ్చారు.
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకి విడుదల చేస్తున్నా.. కేఆర్ఎంబీ నిలుపుదల చేయ లేదని ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరినా బోర్డు … తెలంగాణను ఆదేశించలేకపోయిందని… ఏదో మొక్కుబడిగా లేఖలు రాసి.. సరి పెట్టిందని… ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అదే ఏపీ విషయానికి వచ్చేసరికి… పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా 0.517 టీఎంసీలు వాడుకోగానే.. కృష్ణాబోర్డు నుంచి తాఖీదు వచ్చింది. ఇదేం పద్దతనే అసహనం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది. శ్రీశైలంలో ప్రవాహం పెరిగినందున.. 66 టీఎంసీలు పోతిరెడ్డిపాడుకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డును కోరాలని నిర్ణయించింది.
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కృష్ణా బోర్డు కానీ… తెలంగాణ ప్రభుత్వం కానీ అభ్యంతరం చెప్పకుండా.. ఉండేలా… కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశారు. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణా అంగీకరించిందనే..ఆధారాలను ఏపీ ఇరిగేషన్‌శాఖ సిద్ధం చేసుకుంది. సీమ ప్రాజెక్టులపై తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అధికారులు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటున్నారు. న్యాయ స్థానాలు, అపెక్స్ కౌన్సిల్లో..డాక్యుమెంట్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే.. ఇక కేఆర్ఎంబీ ఆదేశాలను పెద్దగా పట్టించుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.