ఎంత కష్టమైనా బటన్లు నొక్కుతున్నా. అంతకు మించి నేనేమీ చేయలేను. మీ పని మీరు చేయాలి అని వైసీపీ నేతలకు మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ బటన్లూ నొక్కలేకపోతున్నారు. గత జనవరి నుంచి పథకాలు పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చేసిన నిధులకు ఓ సారి తెనాలిలో బహిరంగసభ పెట్టి మీట నొక్కారు. మరోసారి రూ. కోటి నిధులకు నొక్కారు. కానీ గత డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉన్న పథకాలకు మాత్రం మీట నొక్కలేకపోతున్నారు.
ఈబీసీ నేస్తం పథకం కింద గత డిసెంబర్లోనే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకూ మీట నొక్కలేకపోయారు. కారణం ఖజానాలో డబ్బుల్లేవు.
జనవరిలో డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయాల్సి ఉంది. వైఎస్ఆర్ ఆసరా పేరు పెట్టి ప్రతీ ఏటా కొంత మంది ఇస్తామని రూ. యాభై వేల రుణమాఫీ ప్రకటించారు. ఎవరికీ యాభై వేల మాఫీ చేయకపోగా… ఇచ్చే అరకొర కూడా ఇవ్వడం లేదు. ఈ పథకానికి ఆరున్నర వేల కోట్ల వరకూ కావాలి. కానీ మీట నొక్కడానికి కావాల్సిన డబ్బులు దొరకడంలేదు.
విద్యా దీవెన పథకం నిధులు.. ఆరేడు వందల కోట్లు ఇంకా సమకూరలేదు. దీంతో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మార్చికి తీసుకు వచ్చారు. అయినా నిధులు సమకూరలేదు. మళ్లీ వాయిదా వేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి విద్యా దీవెను అని పేరు మార్చారు. నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పి ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగుస్తున్న ఒక్క విడత కూడా చెల్లించలేదు.
ఇక ఈ నెలలోనే వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులు, స్కాలర్ షిప్లు చెల్లించాల్సి ఉంది.
పెండింగ్లో ఉన్న పథకాలన్నీ అమలు చేయాలంటే కనీసం రూ. పదివేల కోట్లు కావాలి. ఇప్పటికీ సగం మంది ఉద్యోగులకు జీతాలు రాలేదని తెలుస్తోంది. నిజానికి కేంద్రం అడిగినన్ని అప్పులు ఇస్తోంది. ఒక్క నెలలో 5800 కోట్ల అప్పు ఇచ్చింది. వాటన్నింటినీ తీసుకుంది. అయినా జగన్ మాత్రం మీట నొక్కలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోతోందన్న సంకేతాలు ఇలాంటి పరిణామాల ద్వారానే వస్తున్నాయి.